తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు ,సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడైన రమేష్ బాబు (56) అనారోగ్యంతో మృతి చెందారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనని హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రమేశ్‌బాబు మృతి చెందినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు.
రమేష్ బాబు మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.రమేష్ బాబు 13 అక్టోబర్, 1965లో కృష్ణ, ఇందిరాదేవి దంపతులకు జన్మించారు. ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాలలో చేసిన రమేష్ బాబు.. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా కొంతకాలం పాటు కొనసాగారు. ఈ మధ్య ఆయన నిర్మాణం పక్కన పెట్టి బిజినెస్ వ్యవహారాలనే చూసుకుంటున్నారు.
1974లో వచ్చిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంతో నటుడిగా పరిచయమైన రమేష్ బాబు, దాదాపు 15 సినిమాలలో నటించారు. ఆ తర్వాత నిర్మాతగా కృష్ణ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి సినిమాలను నిర్మించారు. మహేష్ బాబుతో ‘అర్జున్, అతిథి’ వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. మహేష్ బాబు మరో చిత్రం ‘దూకుడు’కి సమర్పకుడిగా వ్యవహరించారు.