2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్ర వ్యవసాయ రంగ స్థితి, రైతాంగ పరిస్థితి
అగమ్యగోచరం. సాగునీరు లేదు. కరంటు రాదు. విత్తనాలు కావాలంటే పోలీస్ స్టేషన్ల ముందు బారులు తీరి నిలబడాల్సిన అగత్యం. ఎరువులు కావాలంటే లాఠీఛార్జీలో దెబ్బలు తినాల్సిన రోజులు. భూగర్భజలాలు అడుగంటిపోయిన పరిస్థితి. తాగునీటికి కూడా గడ్డుకాలం. కరంటు అడిగితే కాల్చిచంపిన పరిస్థితులు. కరంటు బిల్లులు కట్టలేదని కోతకు వచ్చిన పొలాల దగ్గర నుండి స్టార్టర్లు గుంజుకుపోయిన పరిస్థితి. రైతులను జైళ్లకు పంపించిన దుస్థితి. అన్ని అవాంతరాలు దాటుకుని పంట చేతికి వచ్చి మార్కెట్ కు వస్తే మద్దతు ధర కరవు. అడ్డికి పావుశేరు కింద అమ్ముకోవాల్సిన పరిస్థితులు. వ్యవసాయం చేసి అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడిన రైతాంగం. అసలు వ్యవసాయమే వదిలేసి భవన నిర్మాణ కార్మికులుగా, పట్టణాలలో అపార్ట్ మెంట్లలో వాచ్ మెన్లుగా అనేక ఇతర రంగాలలో ఉపాధులను వెతుక్కున్న పరిస్థితి. వ్యవసాయానికి చేయూత నివ్వకపోగా వ్యవసాయం దండగ అని పాలకులు నిర్వీర్యం చేయడంతో అనివార్యంగా రైతులు ఆత్మహత్యల దారిపట్టారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) వివిధ వార్తా పత్రికలు, ప్రసార మాధ్యమాల నుండి సేకరించిన లెక్కల ప్రకారం 1998 నుండి 2010 వరకు తెలంగాణలో 8147 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాటిలో అప్పటి ప్రభుత్వం అధికారికంగా పోలీస్ కేసులు నమోదై, పోస్టు మార్టమ్ వరకు వెళ్లగా రికార్డ్ చేసినవి 5261 ఆత్మహత్యలు మాత్రమే. అంటే ఇందులో అధికారిక లెక్కలకు వచ్చే సరికి 2886 (35.42 %) ఆత్మహత్యలు మాయమయ్యాయి. ఇదే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 1998 నుండి 2014 వరకు 17,871 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవి కేవలం పత్రికలకు ఎక్కి, పోలీస్ రికార్డులకు ఎక్కి, పోస్టు మార్టమ్ వరకు వెళ్లినవి. పట్టించుకునే దిక్కులేక, ప్రశ్నించే నాధుడు లేక లెక్కలోకి రాని అన్నదాతల అనాధ చావులు ఈ లెక్కలకు మించి రెండింతలు ఎక్కువే ఉంటాయి. కానీ ఏ పాలకుడూ ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల గురించి గానీ, ఆత్మహత్యకు పురిగొల్పుతున్న పరిస్థితుల గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. ఆదుకున్న దాఖలాలు అంతకన్నా లేవు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.6 లక్షల చొప్పున పరిహారం అందించే విధానానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 2014లో 338, 2015లో 504, 2016లో 218, 2017లో 29 మంది ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.6 లక్షల చొప్పున పరిహారం అందించారు. కేవలం ఆత్మహత్య చేసుకున్న రైతులు కాకుండా వ్యవసాయం మీద ఆధారపడిన రైతులకు, రైతాంగ కుటుంబాలకు భరోసా ఉండాలని, రైతులు ఆత్మవిశ్వాసంతో వ్యవసాయం చేయాలని 2018 ఆగస్టు 15 నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుభీమా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ప్రకారం 18 ఏళ్ల నుండి 59 ఏళ్ల వయసు గల రైతు ఏ కారణం చేత మరణించినా రూ.5 లక్షల పరిహారం మరణించిన పది రోజులలో వారి కుటుంబానికి ఎల్ఐసీ ద్వారా అందజేయడం జరుగుతున్నది. ఈ పథకం ప్రారంభించిన నాటి నుండి 2018 – 19 లలో 17,645 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.882.25 కోట్లు, 2019 – 20 లలో 18,954 మందికి రూ.947.70 కోట్లు, 2020 – 21 లో 28,411 మందికి రూ.1420.55 కోట్లు, 2021 – 22లో ఇప్పటి వరకు 6423 మందికి రూ.321.15 కోట్లు చెల్లించడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు 71,433 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.3571.65 కోట్లు చెల్లించడం జరిగింది. దీనికి గాను ఇప్పటి వరకు ప్రీమియం కింద ప్రభుత్వం నాలుగు విడతలలో రూ.3204.73 కోట్లు జీవిత భీమా సంస్థకు చెల్లించడం జరిగింది. ఇది మట్టిని నమ్ముకుని మానవాళికి ఆహారం అందిస్తున్న రైతన్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఘననివాళి. వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకీడుస్తున్న రైతన్నను నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారి కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న భరోసా. ఈ భూమండలం మీద ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో రైతుకు, రైతు కుటుంబాలకు ఇటువంటి పథకం అమలు చేస్తున్న ప్రభుత్వమే లేదు.
మరి కేవలం మూడేళ్లలో 71,433 మంది రైతులు వివిధ రకాల కారణాల చేత మరణిస్తే 1998 నుండి 2014 వరకు ఎంత మంది రైతులు మరణించి ఉంటారు ? అధికారిక లెక్కల ప్రకారమే 1998 నుండి 2014 వరకు 17,871 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని మరణించి ఉంటే అనధికారికంగా మరణించిన వారెంత మంది ? ఇతర కారణాల చేత మరణించిన వారు ఎంత మంది ? వారికి అందిన సాయమేది ? వారిని పట్టించుకున్న నాధుడు ఏడి ? కేసీఆర్ లాంటి ముందుచూపు గల నాయకుడి మూలంగానే కదా స్వరాష్ట్రంలో రైతుభీమా వంటి పథకం ద్వారా అన్నదాతలకు ఆసరా లభిస్తున్నది ? ఇప్పుడు రైతుల గురించి మాట్లాడేవారు ఒక సారి తమ గత చరిత్రతో పాటు, ఇప్పుడు తాము ఏలుతున్న రాష్ట్రాలలో అవలంభిస్తున్న విధానాలను సమీక్షించుకుంటే మంచిది.
14 ఏండ్ల సుధీర్ఘ ఉద్యమంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే కేసీఆర్ 60 శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం మీద దృష్టి సారించారు. సమైక్య పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను 2016 వరకు అందుబాటులోకి తీసుకువచ్చి సాగునీరు అందుబాటులోకి తెచ్చారు. గోదావరి నది మీద కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, కృష్ణా నది మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. కేవలం మూడేళ్లలో ప్రపంచంలోనే ఎత్తయిన కాళేశ్వరం నిర్మాణం పూర్తిచేసి సాగునీరు పారిస్తున్నారు.
సాగునీటితో పాటు వ్యవసాయరంగం పట్ల నమ్మకం కోల్పోయిన రైతాంగంలో ఆత్మస్థయిర్యం నింపేందుకు సాగునీరు అందించడం మాత్రమే కాకుండా ఎకరానికి ఏడాదికి రెండు విడతలలో రూ.ఎనిమిది వేలు అందించే రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. దానిని ఎకరాకు రూ.5 వేలకు పెంచి ఏడాదికి ఎకరానికి రూ.10 వేల చొప్పున అందిస్తున్నారు. 2018 నుండి ఇప్పటి వరకు ఏడు విడతలలో రూ.43,036.64 కోట్లు రైతుల ఖాతాలలో జమచేయగా ఈ యాసంగి పంట కాలానికి గాను సుమారు 65 లక్షల మంది రైతులకు రూ.7500 కోట్లు వారి ఖాతాలలో జమచేయడం జరుగుతున్నది. ఈ ఎనిమిదవ విడతతో కలుపుకుని రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాలలో జమచేసిన మొత్తం రూ.50 వేల కోట్లకు చేరుతుండడం ఒక చారిత్రక సంధర్భం. ప్రపంచంలో ఇప్పటి వరకు ఒక పథకం కింద లబ్దిదారులకు ఇన్ని వేల కోట్లు జమచేసిన చరిత్ర లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వ్యవసాయం పట్ల ఉన్న మక్కువ, రైతాంగం పట్ల ఉన్న ఆప్యాయత మూలంగానే ఇలాంటి గొప్ప పథకం నిర్విగ్నంగా కొనసాగడానికి కారణం అయింది. 63 లక్షల కుటుంబాలు అంటే దాదాపు 2.5 కోట్ల జనాభాకు ప్రత్యక్ష్యంగా ఈ పథకం లబ్ది చేకూరుస్తున్నది.
రైతుబంధు, రైతుభీమా, సాగునీరు, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచడమే కాకుండా వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు సరఫరాను ప్రారంభించారు. సమైక్య పాలనలో కరంటు కోసం అరిగోస పడ్డ రైతాంగం పరిస్థితి నుండి ఈ రోజు అడగకుండానే 24 గంటల ఉచితంగా నాణ్యమైన కరంటు సరఫరాను ప్రారంభించారు. ఫలితంగా సమైక్య రాష్ట్రంలో 22 లక్షలు ఉన్న వ్యవసాయ మోటార్లు ఏడేళ్లలో ఎనిమిది లక్షలు పెరిగి 30 లక్షలకు చేరుకున్నాయి. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేసి ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించడమే కాకుండా రూ.22 లక్షల చొప్పున రాష్ట్రంలో 2601 రైతు వేదికలను నిర్మించడం జరిగింది. రైతులను సంఘటితం చేయాలన్న ఉద్దేశంతో రైతుబంధు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా తెలంగాణ వచ్చేనాటికి విస్తీర్ణ యోగ్యమైన సాగు భూమి 1 కోటి 31 లక్షల ఎకరాలు ఉండగా నేడు 2 కోట్ల 15 లక్షల ఎకరాలకు చేరింది. అంటే అదనంగా 84 లక్షల ఎకరాల నూతన సేధ్యాన్ని తెలంగాణలో సాధించాం. 2014-15 లో పంటల దిగుబడి 154.16 లక్షల టన్నులు ఉండగా, 2020-21 నాటికి (120.55 % వృద్ధి చెంది) 185.84 లక్షల టన్నులు పెరిగి 340.00 లక్షల టన్నులకు చేరుకున్నది. మార్కెట్లో రైతులు డిమాండ్ ఉన్న పంటలనే పండించాలని, సాంప్రదాయ సాగుతో రైతాంగం నష్టపోకూడదన్న ఉద్దేశంతో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సీజన్ కు ముందు ఈ వింగ్ జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను అధ్యయనం చేసి రైతులు ఏ పంటలు పండించాలో సూచనలు చేస్తుంది.
రైతే రాజు గత పాలకులకు నినాదం కానీ అది కేసీఆర్ పాలనా విధానం. అనివార్యంగా రైతులను ఆత్మహత్యల దిశగా ప్రోత్సహించిన పాలన గత పాలకులది. అడగకుండానే అండగా నిలిచి ఆత్మవిశ్వాసం పెంపొందించి సాగు వైపు రైతన్నను ప్రోత్సహించిన పాలన కేసీఆర్ ది. ఈ దేశంలో రైతుకేంద్రంగా పాలన సాగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. నాడు కరంటు అడిగితే కాల్చిచంపారు. నేడు కంటి రెప్ప పాటు కరంటు పోని పరిస్థితి. పల్లెర్లు మొలిసిన భూములలో నేడు బంగారు పంటలు పండుతున్నాయి. పడావుపడ్డ భూములలో పచ్చని పంటలు దర్శనమిస్తున్నాయి. కంపతార చెట్ల స్థానంలో కరవుతీరా పంటలు పండుతున్నాయి. తెలంగాణ అంతా పచ్చబడింది. ప్రకృతి వడిలో రమణియతను పెంచుకున్న ప్రాంతం తెలంగాణ. అనతికాలంలోనే భూమండలం మీద 3.67 శాతం అటవీ విస్తీర్ణాన్ని పెంచుకున్న తెలంగాణ ప్రాంతం 3 డిగ్రీల ఊష్ణోగ్రతలను కూడా తగ్గించుకున్నది.
తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధాానాలపై కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని నీతి అయోగ్
సంస్థ ప్రశంసలు కురిపించింది. నీతి అయోగ్ సభ్యులు రమేష్ చంద్, వ్యవసాయ రంగ నిపుణులు అశోక్ గులాటి, శ్వేతా సైని, దేవేందర్ శర్మ, ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ లు రైతుబంధు పథకం వ్యవసాయ సంక్షోభానికి ఒక పరిష్కారంగా అభివర్ణించారు. 2018 నవంబరులో రోమ్ నగరంలో ప్రపంచ ఆహార సంస్థ ప్రపంచంలో సుస్థిర వ్యవసాయ అభివృద్ది లక్ష్యాలపై నిర్వహించిన అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో ప్రపంచంలోని 20 మేటి పథకాలలో రైతుబంధు, రైతుభీమా పథకాలను కీర్తించింది. భారత ఆహారరంగ సంస్థ ఎఫ్ సీ ఐ గత ఏడాది దేశవ్యాప్తంగా సేకరించిన వరిధాన్యంలో ఒక్క తెలంగాణ నుండే 54 శాతం సేకరించామని ప్రకటించడం తెలంగాణకు గర్వకారణం. ఆకలిచావులతో అల్లాడిన తెలంగాణను ఏడేళ్లలో అన్నపూర్ణగా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం నేడు తెలంగాణలో పరిఢవిల్లుతున్నది. నేడు దేశానికి .. రేపు ప్రపంచానికి తెలంగాణ ఆదర్శంగా నిలబడుతుందడనడంలో ఎలాంటి సందేహం .. సంశయం ఉండాల్సిన అవసరం లేదు.
-సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు
(ఈ నెల 10 వరకు రైతుబంధు వారోత్సవాల సంధర్భంగా)
Post Views: 301