తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరంలో షేక్‌పేట్-రాయదుర్గం ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన తర్వాత మంత్రి కేటీఆర్ రాయదుర్గం వైపు నుంచి ఫ్లై ఓవర్ ఎక్కి షేక్‌పేట వైపు వెళ్లారు. ప్రయాణంలో వంతెనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తీసి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఎస్‌ఆర్‌డీపీ ఇంజనీరింగ్ అధికారుల బృందం గొప్పగా కృషి చేసిందని కొనియాడారు.
అదే సమయంలో, ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో దయచేసి ఈ ఫొటోలను ప్రచారం కోసం వాడుకోవద్దంటూ బీజేపీ నాయకులపై సెటైర్ వేశారు. కోల్‌కతాలో తృణమూల్ ప్రభుత్వం నిర్మించిన ఫ్లై ఓవర్ ఫొటో పెట్టి.. ‘యూపీ మారుతోంది’ అంటూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
దాంతో, బీజేపీపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అయితే, అప్పటి వరకూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి వంతెనను ప్రారంభించిన కేటీఆర్.. సమావేశం ముగిసిన వెంటనే ట్విటర్‌లో ఫొటోలు షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది.