తెలంగాణకు సంబంధించి త్వరలోనే బీజేపీలో కాంగ్రెస్ విలీనం కావడం ఖాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పని చేస్తున్నాయి. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓట్లు బీజేపీ అభ్యర్థికి వేయించలేదా? అని ప్రశ్నించారు. ధాన్యం విషయంలో బీజేపీని కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిలదీస్తలేదని మంత్రి అడిగారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగాన్నిసీఎం కేసీఆర్ అగ్రభాగాన నిలబెట్టారు. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో వ్యవసాయానికి చేయని ఖర్చును తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ప్రతి సంవత్సరం రూ. 60 వేల కోట్ల పైచిలుకు డబ్బులను రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ఖర్చు చేస్తున్నారు. యాసంగిలో బాయిల్డ్ రైస్‌ను కొంటారా.. కొనరా.. అని కేసీఆర్ కేంద్రాన్ని అడిగారు. ఈ విషయంలో గత ఐదారు నెలల నుంచి కేంద్రం స్పందించడం లేదు. కేసీఆర్ దీక్షకు కూర్చుని కేంద్ర వైఖరిని ఎండగట్టారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం మూలంగానే రైతులు గందరగోళానికి గురవుతున్నారు. యాసంగిలో పండే పంటను బాయిల్డ్ రైస్‌గానే మార్చాలి. 50 నుచి 60 లక్షల ఎకరాల్లో వరి పంటను పండిస్తే.. ఆ ధాన్యాన్ని ఎక్కడ పెట్టాలి. దీనిపై కేంద్రం స్పందించాలి. యాసంగిలో సీడ్ కోసం వరి పంట వేసుకునే రైతులపై ఆంక్షలు లేవు. మిల్లర్లకు అమ్ముకుంటామంటే తమకు అభ్యంతరం లేదు. ఎప్పటిలాగా కొనుగోలు కేంద్రాలు ఉంటాయని భావించి.. రైతులు వరి వేస్తే నష్టపోతారు.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఏ పంట వేస్తే రేవంత్ రెడ్డికి ఎందుకు? కేసీఆర్‌ను అమర్యాదగా మాట్లాడటం సరికాదన్నారు. అవగాహనతో, ఆకళింపు చేసుకుని మాట్లాడాలి. మీకు దమ్ముంటే.. తెలంగాణ ప్రజల పట్ల అభిమానం ప్రేమ ఉంటే.. పార్లమెంట్‌లో ఎందుకు కొట్లాడలేదు. సోనియాగాంధీతో పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడించలేదు. మా ఎంపీలతో ఎందుకు కలిసిరాలేదు. ముమ్మాటికీ కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ కొట్లాడదు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు 15 నెలలు పోరాటం చేస్తే కాంగ్రెస్ ఎక్కడుంది? దేశంలో నిజంగానే కాంగ్రెస్ విపక్ష పాత్ర పోషిస్తే.. రైతులకు ఎప్పుడో న్యాయం జరిగేది. రైతాంగానికి బాసటగా నిలవాల్సింది పోయి రెచ్చగొట్టడం సరికాదని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.