కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు ప్రజలంతా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని, ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర మంత్రి శ్రీ హరీశ్ రావు గారు కోరారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువ, తీవ్రత తక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయని, ఆ వేరియంట్ పట్ల నిర్లక్ష్యం వహించకూడదన్నారు. శుక్రవారం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో 100 పడకల ప్రత్యేక వార్డు, ఆక్సిజన్ ప్లాంట్, 12 పడకల ఐసీయూ వార్డును మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఉదయం ప్రారంభించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కరోనా థర్డ్ వేవ్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో పడకలను పెంచుతున్నామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో మరో వంద పడకల ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసుకున్నాం. దీంతో మొత్తం 220 పడకల దాకా అందుబాటులోకి వచ్చాయి. ఇదే సమయంలో నిర్మాణ్ సంస్థ సహకారంతో 12 ఐసీయూ పడకల వార్డ్, ఇన్ఫోసిస్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించుకున్నామని తెలిపారు.
కొవిడ్ థర్డ్ వేవ్ వచ్చినా తట్టుకొనే విధంగా 1600 పడకలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామన్నారు. నిలోఫర్‌లో 800 పడకలు ఏర్పాటు చేస్తున్నాము. మరో 6 ఆస్పత్రుల్లో 100 పడకలు చొప్పున ఏర్పాటు చేస్తున్నాము అని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో 21 లక్షల హోం ఐసోలేషన్ కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు, స్టోరేజ్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాం అని మంత్రి తెలిపారు.ప్రజలంతా మాస్కు తప్పకుండా ధరించాలని .. వ్యాక్సినేషన్ తీసుకోవాలని కోరారు హరీశ్ రావు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం కూడా పాటించాలని తెలిపారు. ఈ మూడు పాటించినప్పుడే వైరస్‌ను ఎదుర్కోనే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి.. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ.. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల్లో పాల్గొనాలి అని హరీశ్‌రావు సూచించారు.