తెలంగాణ రాష్ట్ర సమితి కీలక సమావేశం శుక్రవారం తెలంగాణభవన్‌లో జరుగనుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు జరుగనున్న ఈ భేటీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతుబంధు సమితి జిల్లా కమిటీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లతోపాటు టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధుపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.వరి కొనుగోళ్ల విషయంలో కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షాపూరిత వైఖరి, టీఆర్‌ఎస్‌పై బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న విష ప్రచారంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
కేంద్ర ప్రభుత్వం ఒక మాట, రాష్ట్ర బీజేపీ నేతలు మరోమాట మాట్లాడుతూ రైతులను అయోమయానికి గురిచేస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ రైతులను కాపాడుకోవటానికి పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహంపై ఓ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తున్నది. మరోవైపు పార్టీ సంస్థాగత నిర్మాణం, జిల్లా పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, అన్ని స్థాయిల శ్రేణులకు శిక్షణా తరగతుల నిర్వహణ వంటి అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.