ప్రతిష్ఠాత్మక బహుళదశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తన సొంత వనరులతోనే నిర్మిస్తున్నదని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లోక్‌సభలో వెల్లడించారు.నిర్మాణ పనులకు ఆన్‌లైన్ టెండర్ విధానాన్ని అనుసరించిందని చెప్పారు. గురువారం కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. కాళేశ్వరానికి అనుమతులున్నాయా? ఎంత ఖర్చు చేశారు?
ప్రాజె క్టు ద్వారా కలిగే ప్రయోజనాలు తదితర అంశాలపై అడిగిన ప్రశ్నకు షెకావత్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జల్‌శక్తి శాఖలోని సాగునీరు, వరద నియంత్రణ, బహుళార్థ సాధక ప్రాజెక్టుల సలహా కమిటీ.. కాళేశ్వరం ప్రాజెక్టును ఆమోదించిందని పేర్కొన్నారు. కాళేశ్వరం కింద 18,25,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని, మరో 18,86,970 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని చెప్పారు.
ప్రాజెక్టు ద్వారా 240 టీఎంసీలు ఎత్తిపోస్తారని, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, నల్లగొం డ, సంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి జిల్లాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. 2021 అక్టోబర్ 10 నాటికి 83.7 శాతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని చెప్పారు. రూపాయికి రూపాయిన్నర లబ్ధి కలుగుతుందన్న అంచనాతో 2018 జూన్‌లో సాగునీరు, వరద నియంత్రణ, బహుళార్థ సాధక ప్రాజెక్టుల సలహా కమిటీ.. ప్రాజెక్టు నిర్మాణానికి 80,190.46 కోట్ల అంచనా వ్యయాన్ని ఖరారు చేసిందన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.80,321.57 కోట్లు వెచ్చించిందని చెప్పారు. ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు కింద 20,878 మంది నిర్వాసితులయ్యారని, వారందరికీ పునరావాసం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు.