తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. థర్డ్ వేవ్ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఇప్పటి నుంచే ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇప్పటికే కాలనీల వారీగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతూ మొదటి డోసు, రెండో డోసు వ్యాక్సిన్ ప్రక్రియను ముమ్మరం చేసింది.
అంతేకాకుండా 2173 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో రసాయనాలు స్ప్రే చేశారు. పాజిటివ్ నమోదవుతున్న ప్రాంతాలు, వాటి పరిసరాలు, జనసాంద్రత గల ఏరియాలు, ఆస్పత్రులు, ఇనిస్టిట్యూట్స్, పర్యాటక ప్రాంతాల్లోనూ సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.వీటితో పాటు తాజాగా సర్కిళ్ల వారీగా హోం ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది సర్కిల్‌కు ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాల్లో పడకలు, ఆహార వసతులు, మరుగుదోడ్లు వంటి సౌకర్యాలను సమకూర్చుతున్నారు.
అంతేకాకుండా సర్కిల్‌కు అదనంగా మరొకటి ఉండేలా కమ్యూనిటీ హాల్, కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్ వివరాలను సేకరించి స్థలాన్ని ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఒకపక్క మాస్కులు ప్రతి ఒక్కరూ ధరించాలని ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే, మరోపక్క ఐసొలేషన్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. పాజిటివ్ నమోదయ్యే ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా కంటైన్‌మెంట్ జోన్ల ఏర్పాటు దిశగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.