పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది.బలమైన మార్కెట్, వ్యాపారాభివృద్ధికున్న విస్తృత అవకాశాలతో మార్స్ పెట్‌కేర్ ఇండియా రూ.500 కోట్లతో ప్లాంట్ విస్తరణకు ముందుక్చొంది. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు.. వేగంగా ఇస్తున్న అనుమతులు.. పారిశ్రామిక విస్తరణకు దోహదం చేస్తున్నాయి. సమర్థవంతమైన అధికార యంత్రాంగం కృషీ కలిసొస్తున్నది.
పెంపుడు జంతువుల ఆహార కంపెనీ మార్స్ పెట్‌కేర్ ఇండియా సంస్థ రూ.500 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లోని తన ఫ్యాక్టరీని విస్తరించబోతోంది. ఈ మేరకు గురువారం సంస్థ ప్రతినిధులు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వంతో ఎంవోయూ (మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్)ను కుదుర్చుకున్నారు. ఈ విస్తరణ ద్వారా స్థానికంగా 180 నుంచి 200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. అదేవిధంగా పెట్ ఆహార పదార్థాల తయారీకి వినియోగించే ముడి సరుకులకు సంబంధించి కూడా స్థానికంగా వ్యాపారాలు మరింత పెరిగేందుకు దోహదపడనుంది.
ప్రోత్సాహకాలు కల్పిస్తాం
మెగా ప్రాజెక్టు కేటగిరీలో ఈ పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. కంపెనీ యాజమాన్యానికి హామీ ఇచ్చారు. మార్స్ పెట్‌కేర్ సంస్థ ఉత్పత్తుల తయారీలో అవసరమైన ముడి పదార్థాలకు సంబంధించి కూడా రాష్ట్రం నుంచి మరిన్ని ఒప్పందాలు చేసుకోనున్నట్టు తెలియజేశారు. అలాగే వ్యాపారపరంగా కూడా తెలంగాణ రాష్ట్రం, మార్స్ పెట్‌కేర్ సంస్థ మధ్య భాగస్వామ్యం మరింత బలపడాలని ఆకాంక్షించారు. మార్స్ పెట్‌కేర్ ఇండియా ఎండీ గణేశ్ రమణి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో 2008లోనే తొలి ఉత్పాదక కేంద్రాన్ని ప్రారంభించినట్టు తెలిపారు.
తయారు చేసిన ఆహారం పెంపుడు జంతువులకు అందించడంపై అవగాహన పెరగడంతో మార్కెట్ సైతం పుంజుకుంటోందన్నారు. 2019లో 16 శాతం పరిశ్రమ వృద్ధి చెందగా, 2020లో 20 శాతానికి చేరిందన్నారు. ఈ రెండేండ్లలో మార్కెట్లో సంస్థ మొదటి స్థానంలో నిలిచిందని, 2021లోనూ మార్కెట్ షేర్ 35 నుంచి 40 శాతం వరకు పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు ఫ్యాక్టరీ విస్తరణ ఇందుకు మరింత దోహదపడుతుందన్నారు. ముఖ్యంగా స్థానికులకు కూడా ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.