జనగామ బహిరంగ సభకు భారీ ఎత్తున జనం తరలి వస్తున్నారని, ఆ సభను విజయవంతం చేయడానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమన్వయంతో, సమిష్టి గా కృషి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. సీఎం గారి బహిరంగ సభ ఏర్పాట్ల సన్నాహక సమావేశాలు జరిగాయి. పాలకుర్తి, కొడకండ్ల మండలాల ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం పాలకుర్తి క్యాంప్ కార్యాలయంలో, దేవరుప్పుల మండల సమావేశం అదే మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్స్ లో శుక్రవారం జరిగాయి. ఈ సమావేశాల్లో పార్టీ పరిశీలకులు, వివిధ విభాగాల ఇంచార్జీ లు పూర్వ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, వరంగల్ dccb చైర్మన్ మార్నేని రవీందర్ రావు, మెట్టు శ్రీనివాస్, భరత్ కుమార్ రెడ్డి, జన్ను జకార్య, స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, జనగామ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం కెసిఆర్ ప్రారంభిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా బహిరంగ సభ లో సీఎం మాట్లాడతారని, తెలంగాణలో అమలు అవుతున్న, అభివృద్ధి, సంక్షేమాలను సీఎం ప్రజలకు వివరిస్తారని చెప్పారు. అలాగే ప్రతిపక్షాలు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పై చూపుతున్న వివక్షను ఎండగతారని మంత్రి చెప్పారు. గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నదని మంత్రి వివరించారు. ప్రజలు, పార్టీ శ్రేణులు జనగామ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కడియం శ్రీహరి మాట్లాడుతూ, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో, అన్ని విధాలుగా అద్భుతమైన అభివృద్ధి చేస్తున్నారని అభినందించారు.
దేశంలో ఎక్కడా లేనన్ని పథకాలు అమలు అవుతున్నాయి. విద్యుత్ ఉచిత విద్యుత్ కోసం ప్రతి ఏటా 10 వేల కోట్లు రైతాంగం తరపున సబ్సిడీ ఇస్తున్నాం. సాగు నీటి కొరత లేకుండా చేస్తున్నారు. ఇంటింటికీ 100 శాతం పరిశుభ్రమైన మంచినీటిని ప్రజలకు అందిస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణ మాత్రమే. ధాన్యం, బియ్యం కొనుగోలు విషయంలో కేంద్రం తన బాధ్యతల నుండి తప్పించుకుంటున్నది. తెలంగాణ లో ప్రతి ఏడాది కోటి 10 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతున్నది. దిగుబడి కూడా అదే స్థాయిలో పెరిగింది. ఈ దశలో సహకరించాల్సిన కేంద్రం, సహాయ నిరాకరణ చేస్తున్నది. ఈ తరుణంలో మన రాష్ట్ర వైఖరిని సీఎం స్పష్టంగా కేంద్రానికి చెప్పారన్నారు. ప్రజలను తాజా అంశాలపై చైతన్యం చేయడంతోపాటు, ప్రభుత్వ విధానాలను సీఎం కెసిఆర్ ప్రజలకు వివరిస్తారని చెప్పారు. సభను విజయవంతం చేయాలని కోరారు.