ఆమెను వ్యవసాయం నీ వల్ల కాదన్నారు అందరూ. భర్తను పోగొట్టుకుని ఒంటరిగా పిల్లలను పెంచి పెద్దచేయడానికి ఆ సేద్యాన్నే నమ్ముకుందామె. పట్టుదలగా వ్యవసాయంలోని మెలకువలు తెలుసుకొని అధిక దిగుబడి అందుకుంటోంది. ఏటా రూ.30 లక్షల ఆదాయాన్ని పొందుతూ… విమర్శించిన వారెదుటే.. తానేంటో నిరూపిస్తోన్న 39 ఏళ్ల సంగీత పింగ్లే స్ఫూర్తి కథనమిది.
సైన్స్ గ్రాడ్యుయేట్‌గా పట్టా తీసుకున్న సంగీతకు వ్యవసాయ నేపథ్యం ఉన్న వ్యక్తితో పెళ్లైంది. ఈ దంపతులకు పుట్టిన ఇద్దరు పిల్లల్లో రెండో సంతానం అనారోగ్యంతో చనిపోతే, మూడేళ్ల తర్వాత 2007లో మళ్లీ గర్భందాల్చింది. ఆ సంతోష సమయంలో అంతా ఉండగా ఓ రోడ్డు ప్రమాదంలో భర్త ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడు సంగీత నిండు గర్భిణి. కడుపులో బిడ్డ, చేతిలో 10 ఏళ్ల ఆడపిల్లతో ఆమెకేం చేయాలో పాలుపోలేదు. ఉమ్మడి కుటుంబం కావడంతో అందరూ ఆమెకు తోడుగా ఉంటామన్నారు. భర్త చనిపోయిన ఏడెనిమిదేళ్లకు ఊహించని సమస్యలతో ఆ కుటుంబం విడిపోయింది. దాంతో అత్తామామ, పిల్లలతో ఈమె విడిగా వచ్చేసింది. తమ వాటాకొచ్చిన 13 ఎకరాల పొలంలో అత్తామామలు సేద్యం చేద్దామనుకున్నారు. రెండు నెలల్లోపే మామగారూ చనిపోయారు. కుటుంబానికి పెద్ద దిక్కు చనిపోవడంతో ఏం చేయాలో తోచలేదు సంగీతకు. సేద్యం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించింది. ‘మహిళవు. నువ్వు వ్యవసాయం చేస్తావా? నీవల్ల కాదు’ అన్నారందరూ. తరతరాలుగా అత్తగారి కుటుంబ జీవనాధారం సేద్యమే. అలాంటప్పుడు తాను ఎందుకు చేయలేననుకుంది. విమర్శలు పట్టించుకోకుండా, వ్యవసాయంపై అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నించింది.
ఒంటరిగానే… చేతిలో పొలం తప్ప, నయాపైసా లేదు. తన నగలను బ్యాంకులో తాకట్టు పెట్టి కొంత నగదు తెచ్చుకుంది. ‘మా కజిన్స్ కొందరు ఆర్థిక సాయం చేశారు. ద్రాక్ష, టొమాటోలను పండించాలని నిర్ణయించుకున్నా. నిపుణుల సలహాలూ తీసుకునేదాన్ని. మాకున్న మొత్తం భూమిలో ఈ రెండు పంటలూ వేశా. సైన్స్ చదివిన నాకు ఈ అంశాలు త్వరగా అర్థమయ్యేవి. పంట బాగా పండి దిగుబడి చేతికి వచ్చేలోపు ఎన్నో సవాళ్లు. సమయానికి కూలీలు దొరికేవారు కాదు. అనుకోకుండా కురిసే వానలతో పంట నాశనమయ్యేది. కొన్నిసార్లు లాభం కాదు కదా.. కనీసం పెట్టుబడి కూడా చేతికి అందేదికాదు. టెక్నికల్‌పరమైన అంశాలు కూడా ఛాలెంజ్‌గా నిలిచేవి. మార్కెట్‌కు వెళ్లాలన్నా, ఎరువులు కొనుక్కు రావాలన్నా ఇబ్బందయ్యేది. దాంతో బండి, ట్రాక్టరు నడపడం నేర్చుకున్నా. వాటి మరమ్మతులూ తెలుసుకున్నా. నాలుగేళ్లలో మార్కెటింగ్ పనులన్నీ నేనే పూర్తిచేసే స్థాయికి ఎదిగా. ప్రస్తుతం ఏడాదికి 800 నుంచి 1000 టన్నుల ద్రాక్ష పండించి ఏడాదికి రూ.25 నుంచి 30 లక్షల ఆదాయాన్ని ఆర్జించగలుగుతున్నా. పిల్లలిద్దరినీ చదివిస్తున్నా. నన్ను తీవ్రంగా విమర్శించిన, ఓ మహిళ అయ్యుండి ఒంటరిగా వ్యవసాయం చేయలేవు అంటూ మాటలతో బాధపెట్టిన వారెదుటే సాధించి చూపించా. నా విజయాన్ని గర్వంగా భావిస్తున్నా. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే క్షణం వృథా చేయకుండా కష్టపడితే విజయాన్ని సాధించొచ్చు. త్వరలో ద్రాక్షను ఇతరదేశాలకూ ఎగుమతి చేయనున్నా’ అని చెబుతోంది సంగీత.
Tags Health Tips inspiration life life style sangeetha slider