మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బహిరంగ లేఖ
నా తెలంగాణ రైతన్నలకు రాయునది ఏమనగా…
తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్ల కోసం. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 22 లక్షల బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్న పరిస్థితుల్లో వానలు రాక, కరెంటు లేక, సాగు నీరందక నిత్యం బాధామయ పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే సమస్యల పరిష్కారానికి మార్గమని కేసీఆర్ 2001లో మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారు. అనేక ఒడిదుడుకులు, 14 ఏండ్ల సుదీర్ఘ ఉద్యమం, అమరుల త్యాగాలు, ప్రజల అండదండలతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి, ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంటును ఒప్పించి రాష్ర్టాన్ని సాధించారు.
వ్యవసాయమే వృత్తిగా దాదాపు 60 శాతం మంది ఆధారపడిన ఈ రంగాన్ని బలోపేతం చేయాలన్న తలంపుతో.. రాష్ట్రం ఆవిర్భవించిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టుల మీద దృష్టిసారించి యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టి మూడున్నరేండ్లలో పూర్తిచేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ప్రస్తుతం 70 శాతం పైగా పూర్తయ్యాయి. సీతారామసాగర్ ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది.
వ్యవసాయ అనుకూల విధానాలు: రైతులకు ఆత్మైస్థెర్యం కల్పించి వ్యవసాయం చేసేందుకు దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా వినూత్న పథకాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేసి, గోదాముల నిర్మాణం చేసి వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మార్చేందుకు అన్నిరకాల చర్యలు తీసుకున్నారు. గత ఏడేండ్లలో తెలంగాణ వ్యవసాయరంగ ముఖచిత్రం సంపూర్ణంగా మారిపోయింది. ఆకలిచావులతో అల్లాడిన తెలంగాణ.. అన్నపూర్ణగా మారింది. తిండిగింజలకు తండ్లాడిన తెలంగాణ.. ధాన్యపు రాశులతో కళకళలాడుతున్నది. సీఎం కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగానే ఈ విజయం సాధ్యమైంది.
అనూహ్యంగా పెరిగిన సాగు, పంటల దిగుబడి: తెలంగాణ వచ్చేనాటికి రెండు సీజన్లు కలిపి సాగుకు యోగ్యమైన భూమి కోటి 31 లక్షల ఎకరాలు. 2020-21 నాటికి అన్ని పంటలు కలిపి సాగు విస్తీర్ణమైన భూమి 2 కోట్ల 15 లక్షల ఎకరాలకు చేరుకున్నది. ఈ ఏడేండ్లలో సాగు విస్తీర్ణం 50 శాతానికి పైగా పెరిగింది. అలాగే 2014-15లో వరిసాగు విస్తీర్ణం రెండు పంటలు కలిపి 34.96 లక్షల ఎకరాలుంటే, 2020-21 నాటికి 198.15%పెరిగి 104.23 లక్షల ఎకరాలకు చేరుకున్నది. 2014-15లో వరి ధాన్యం దిగుబడి 68.17 లక్షల టన్నులుంటే, 2020-21 నాటికి అనూహ్యంగా సుమారు 3 కోట్ల టన్నులకు చేరుకున్నది.
తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014-15లో 24.30 లక్షల టన్నుల వరిధాన్యం సేకరించగా, 2020-21లో (480.25 శాతం వృద్ధి) 116.70 లక్షల టన్నులు పెరిగి 141.00 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించడమైనది. 2020-21 వానకాలం, యాసంగిలో ప్రతి సీజన్‌లో 6,967 కేంద్రాల ద్వారా రైతుల కల్లాల వద్దే 1.41 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ముఖ్యంగా దొడ్డు వడ్లు సాగు పెరగడానికి కారణం కేంద్రం అనుసరిస్తున్న విధానాలే. పారా బాయిల్డ్ రైస్ వినియోగానికి తగినట్లు ఉత్పత్తి లేనందున దేశంలో సన్నరకాల కన్నా అధిక దిగుబడులు ఇచ్చే దొడ్డు రకాలకు అధిక మద్దతు ధర ఇచ్చి, వాటిని సేకరిస్తూ కేంద్రం రైతులను ప్రోత్సహించింది. దిగుబడితో పాటు అధిక ధర లభించడంతో దశాబ్దాలుగా రైతాంగం దొడ్డు వడ్ల సాగుకే మొగ్గుచూపింది.
పెరిగిన సాగు విస్తీర్ణం, దిగుబడులకు అనుగుణంగా పంటల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందిస్తున్నది. క్షేత్రస్థాయిలో వివిధ పంటల సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ముందే బ్యాంకుల ద్వారా నిధులు సేకరించి, యంత్రాంగాన్ని సమాయత్తం చేసి, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నది. కానీ ధాన్యం సేకరణ అనంతరం ఆరు నెలల తర్వాత కేంద్రం రైతులకు నిధులు విడుదల చేస్తుంది. అదే సమయంలో కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన పది రోజుల లోపు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తూ వడ్డీ భారాన్ని కూడా మోస్తున్నది. కరోనా విపత్తు సమయంలోనూ రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించింది. ఎఫ్‌సీఐకి గోదాముల సామర్థ్యం లేకున్నా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ గోదాములతో పాటు ఫంక్షన్ హాళ్లు, రైతు వేదికలు, రైస్ మిల్లులు, పత్తి మిల్లులు, స్కూళ్లు, కళాశాల భవనాలు తదితర స్థలాలను ధాన్యం నిల్వకు ఉపయోగించడం జరిగింది.
తెలంగాణ ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరణ: ఉన్నపళంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని యాసంగి ధాన్యం కొనుగోలు చేయలేమని అంటున్నది. గత ఆరు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రాన్ని అడుగుతున్నా స్పష్టత ఇవ్వడం లేదు. వివిధ రాష్ర్టాల్లో వానకాలంలో మాత్రమే వరి పంట సాగు చేస్తారు. తెలుగు రాష్ర్టాల్లో వానకాలంతో పాటు యాసంగిలో కూడా వరి విస్తారంగా సాగు చేస్తారు. ముఖ్యంగా తెలంగాణలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగి వరిలో ఎక్కువగా దొడ్డు రకాలే సాగుచేస్తారు. సన్న వడ్ల సాగులో పెట్టుబడి అధికం, దిగుబడి తక్కువగా రావడం, మద్దతు ధర ఆశించినంతగా లేకపోవడంతో దొడ్డు రకాలను మాత్రమే సాగు చేస్తున్నారు. దొడ్డు రకాలను బియ్యంగా మార్చినప్పుడు యాసంగి పంటలో నూక శాతం ఎక్కువగా ఉంటున్నది. నూక శాతం తగ్గించడానికి బాయిల్డ్ రైస్ రూపంలో ఎఫ్‌సీఐ సేకరిస్తూ వస్తున్నది. అయితే ఈ ఏడాది యాసంగి నుంచి తెలంగాణలో బాయిల్డ్ రైస్ సేకరించలేమని హఠాత్తుగా ప్రకటించి తెలంగాణ రైతాంగానికి పిడుగుపాటు నిర్ణయం చెప్పింది. దేశంలో పారా బాయిల్డ్ రైస్ వినియోగం తగ్గిందని, బియ్యం నిల్వలు పెరిగిపోయాయని కేంద్రం సాకులు చెప్తున్నది.
ధాన్యం సేకరణ కేంద్ర ప్రభుత్వ విధి: రైతులు పండించే పంటలకు మద్దతుధర ప్రకటించడం, వాటిని సేకరించి, నిల్వచేసి, కరువు కాటకాలు తలెత్తినప్పుడు పంపిణీ చేయడమే కాకుండా పేద బడుగు బలహీనవర్గాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయడం కేంద్ర ప్రభుత్వ విధి. ఇది 1960 దశకం నుంచి కొనసాగుతున్నది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు ఎఫ్‌సీఐ కొనుగోలు చేస్తుంది. 2015లో మోదీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన శాంతకుమార్ కమిటీ- పంటల కొనుగోలు మా త్రమే కాకుండా పంటల ఎగుమతుల మీద కూడా ఎఫ్‌సీఐ దృష్టిసారించాలని, నిల్వల సామర్థ్యం పెం చుకోవాలని, పండిన పంటలన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నివేదికలో సూచించింది. కానీ కేంద్రం ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ధాన్యం కొనుగోలులో కేంద్రం డబుల్ గేమ్: తెలంగాణలో యాసంగి వరి ధాన్యం సేకరణలో కేంద్రం వైఖరి ‘దూడను చీకమని, బర్రెను తన్న’మని చెప్పినట్లుంది. ధాన్యం సేకరణ, వరి సాగు విషయంలో కేంద్ర మంత్రులు భిన్నవాదనలతో తెలంగాణ రైతాంగాన్ని గందరగోళ పరుస్తున్నారు. గతేడాది కొనుగోలు చేసిన ధాన్యం నుంచి తీసిన బియ్యాన్ని ఇక్కడి గోదాముల నుంచి తరలించకుండా, ఆ నెపాన్ని రాష్ట్రం మీద నెట్టి రైతులను తప్పుదారి పట్టిస్తున్నది. ఇంకోవైపు కేంద్ర వ్యవసాయ మంత్రి థోమర్ ‘వరి సాగు విషయం లో తెలంగాణకు ఎలాంటి ఆంక్షలు విధించలేద’ని పార్లమెంట్‌లో అన్నారు. బాయిల్డ్ రైస్ సేకరించలేమని ఒకవైపు, వరి సాగు మీద ఆంక్షల్లేవని ఇంకోవైపు ప్రకటించడం ద్వారా కేంద్రం ద్వంద్వ విధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణ బీజేపీ నేతలు ‘వరి సాగు మాత్రమే చేయాల’ని చెప్తూ రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. తెలంగాణ రైతాంగం ఈ భిన్న వైఖరులను గమనించాలి.
వాస్తవంగా దేశంలో కొరత ఉన్న పప్పుధాన్యాలు, నూనె గింజలను ఇతర దేశాల నుంచి సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వెచ్చించే రూ.2 లక్షల కోట్లకు బదులు, శాంతకుమార్ కమిటీ సూచన మేరకు దేశంలో వాటి సాగుకు, రాష్ర్టాల ద్వారా వాటిని సేకరించేందుకు కేంద్రం సహకారం అందించాలి. దేశంలో కార్పొరేట్ సంస్థలకు సుంకాలను తగ్గిస్తూ, లక్షల కోట్ల రుణాలను రద్దు చేస్తూ అండగా నిలుస్తున్నది. కానీ ప్రపంచానికి అన్నం పెట్టే రైతుకు ప్రోత్సాహం అందించడం లేదు. కార్పొరేట్లకు ఇస్తున్న సహకారం వ్యవసాయరంగానికి కేంద్రం అందిస్తే రైతులకు ఇబ్బందులు తొలగుతాయి. ఆ దిశగా కేంద్రం ఆలోచించకపోవడం దురదృష్టకరం.
వరికి బదులుగా ఇతర పంటల సాగు మేలు: తెలంగాణ నేలలు అన్నిరకాల పంటల సాగుకు అనుకూలం. దీన్ని గమనించే సీఎం కేసీఆర్ దండుగన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితులు ప్రపంచంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే సొంతం. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాల్సిన అవసరం ఉన్నది. దీనికిగాను రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారి ‘మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్’ను ఏర్పాటుచేసి సీజన్‌కు ముందే ఏ రకమైన పంటలు సాగు చేయాలన్న దానిపై సూచనలు చేస్తున్నది. రైతు వేదికల ద్వారా క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణాధికారులు రైతులకు ఇతర పంటల వైపు మళ్లాల్సిన అవశ్యకతను వివరిస్తున్నారు. కూలీల సమస్య తీరటం కోసం ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఆరేండ్లుగా కేసీఆర్ కేంద్రాన్ని కోరుతున్నా వారి వైఖరిలో ఎటువంటి చలనం లేకపోవటం గర్హనీయం.
తెలంగాణ నేలలు అన్నిరకాల పంటల సాగుకు అనుకూలం. దీన్ని గమనించే సీఎం కేసీఆర్.. దండుగన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితులు ప్రపంచంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే సొంతం. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాల్సిన అవసరం ఉన్నది.
కేంద్ర ప్రభుత్వ మోసపూరిత విధానాలను పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా రైతాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఆరుతడి పంటల వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాలను అర్థం చేసుకొని రైతులు ఈ యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు మాత్రమే సాగుచేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం ఇచ్చే, మార్కెట్లో డిమాండ్ ఉండే పప్పు దినుసులు, నూనెగింజల పంటలను సాగుచేసి అధిక ఆదాయం పొందాలని ఆకాంక్షిస్తున్నది.
(వ్యాసకర్త: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి
సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి