హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌కు రేపు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన భౌతికకాయాన్ని ఇవాళ సాయంత్రం ఢిల్లీకి తీసుకురానున్నారు. తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉన్న కూనూరు వద్ద హెలికాప్టర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో 13 మంది మృతిచెందారు.
దాంట్లో బిపిన్ రావత్ సతీమణి మధులిక కూడా ఉన్నారు. అయితే కోయంబత్తూరు నుంచి వాయుసేన ప్రత్యేక విమానంలో బిపిన్ రావత్ పార్దీవదేహాన్ని తరలించనున్నారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో రావత్ భౌతికకాయాన్ని ఉంచనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం అక్కడ ఉంచుతామని అధికారులు ప్రకటించారు.
కామరాజ్ మార్గ్ నుంచి ఢిల్లీ కంటోన్‌మెంట్‌లోని బ్రార్ స్వ్వేర్ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర కొనసాగుతుందని తెలిపారు. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. అయితే హెలికాప్టర్ కూలిన ఘటనపై ఇవాళ పార్లమెంట్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేయనున్నారు.