తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పూర్తికి ప్రతిఒక్కరి భాగస్వామ్యం అవసరమని మంత్రి హరీశ్ రావు అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు టీకాయే మార్గమని చెప్పారు. అందువల్ల ప్రజాప్రతినిథులు తమ పరిధిలో ఉన్న ప్రతిఒక్కరికి వ్యాక్సిన్ అందేలా చూడాలని సూచించారు. నగరంలోని కొండాపూర్ ఉన్న ప్రభుత్వ దవాఖానలో ఆధునిక వసతులను అందుబాటులోకి తెచ్చారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి అదనపు పడకల సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు వీలుగా అదనంగా 120 పడకలతో మెరుగైన వసతులు కల్పించామన్నారు. సీఎస్‌ఐఆర్‌లో భాగంగా రహేజా కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో 3.96 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామన్నారు. ప్రతి రోజు 4 లక్షల మందికి టీకాలు ఇస్తున్నామని చెప్పారు. కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 33 జిల్లాల్లో 6 వేల పడకలతో చిన్న పిల్లల కోసం పీడియాట్రిక్ విభాగాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో 27 వేల పడకలు ఉన్నాయని చెప్పారు. డయాలసిస్ యూనిట్ల పెంపునకు కృషి చేస్తామన్నారు.