తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రెండురోజులు పాటు గోవా రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహం మరియు పెట్టుబడులను ఆకర్షించే మార్గాలపై కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో వివిధ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, పరిశ్రమ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, సాంకేతిక నిపుణుల రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. కేంద్ర భారీ పరిశ్రమలు మంత్రిత్వ శాఖ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు డిసెంబర్ 4న గోవా రాష్ట్రంలోని లాలిట్ గోల్ఫ్ & స్పా రిసార్ట్, కెనకోనాలో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొననున్నారు.
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) నూతన పాలసీని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించి 2020-2030 కాలానికి ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన విధానాలను వెల్లడించారు. రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్ హబ్‌గా మార్చే ప్రణాళికలో భాగంగా నూతన విధానాలను రూపొందించి తాజా విధానాలకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది.
రాష్ట్రంలోనే కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి పలు రాయితీలు ఇస్తున్నది దీనిలో భాగంగా తొలి 2 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 20వేల ఆటోలు, మొదటి 5వేల 4 చక్రాల వాహనాలు, మొదటి 10వేల లైట్ గూడ్స్ వాహనాలు, మొదటి 5వేల ఎలక్ట్రిక్ కార్లు, 500 ఎలక్ట్రిక్ బస్సులకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ రుసుం మినహాయింపు సైతం ఇచ్చింది. ప్రజా రవాణా వ్యవస్థలోనూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రోత్సాహం అందిస్తూ ఛార్జింగ్ అవసరాల కోసం అవసరమైన చర్యలు చేపడుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, విధివిధానాలపై ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివరించనున్నారు.