తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతిభవన్‌లో జరుగనున్నది. ఈ సమావేశంలో వరి ధాన్యం సేకరణ విషయంలో కేందప్రభుత్వ వైఖరిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నది.
కేంద్రం ధాన్యాన్ని సేకరించేలా వత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. యాసంగిలో వరిధాన్యం తీసుకోబోమని కేంద్రం తెగేసి చెప్పటంతో ఇతర పంటల సాగుపై రైతులకు సూచనలు చేసే విషయంపై కూడా క్యాబినెట్‌లో చర్చించనున్నారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రాష్ట్రంలో ప్రవేశించకుండా అడ్డుకొనే చర్యలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది. ముప్పును ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖలన్నింటినీ సిద్ధంచేసే ప్రణాళికపై సీఎం సూచనలు చేయనున్నట్టు తెలిసింది. వివాదాస్పద సాగుచట్టాలపై పోరాటంలో అసువులుబాసిన రైతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించే అంశంపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. వీటితోపాటు పోడుభూములు, దళితబంధు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నది.