ఏ రంగంలో అయిన వారసుల హవా తప్పక ఉంటుంది. సినీ పరిశ్రమలో అయితే అదీ మరి ఎక్కువ. కొందరు స్టార్స్ తమ వారసులని లేదంటే తమ్ముళ్లు, కజిన్స్‌ని వెండితెరకు పరిచయం చేస్తూ ఉంటారు. తాజాగా టాలీవుడ్ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి సోదరుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. శివారెడ్డి పలు వేదికపై నవ్వించడంతో పాటు సినిమాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
శివారెడ్డి సోదరుడు సంపత్ త్వరలో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. సంపత్ కథానాయకుడిగా రామ చంద్ర దర్శకత్వంలో శ్రీనివాస్ నిర్మిస్తోన్న చిత్రం ‘అరణ్య వాసం’. రాయలసీమలోని ఓ విలేజ్ బ్యాక్‌డ్రాప్ లవ్‌స్టోరి ఇది. ఇప్పటికే తొంబై శాతం చిత్రీకరణను కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా రవి బోయిడపు పనిచేస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులని అలరించబోతున్నారు సంపత్.
రవి బోయడపు.. శివ కుమార్.బి దర్శకత్వంలో రూపొందిన 22 చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. అంతకు ముందు శివ కుమార్.బి డైరెక్షన్‌లోనే రూపొందిన వెబ్ సిరీస్ వర్కవుట్ అయ్యిందికి కూడా వర్క్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కమల్‌జీత్ నేగి వద్ద అసిస్టెంట్ కెమెరామెన్‌గా కూడా పని చేశారు.