కెరీర్ విషయంలో నేటితరం కథానాయికల సమీకరణాలు పూర్తి వ్యాపార కోణంలోనే ఉంటున్నాయి. ఏదో ఒక భాషా చిత్రానికే పరిమితమైపోయి అక్కడే రాణిద్దామనుకునే పాత కాలపు ఆలోచనలకు స్వస్తి పలికి వివిధ భాషా చిత్రాల్లో నటిస్తూ తమ పరిధిని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు చిత్రసీమలో మంచి విజయాలు సాధించిన వర్ధమాన నాయికలు చాలా మంది ఇప్పుడు పరభాషాల్లో అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. పాన్‌ఇండియా ట్రెండ్ ఊపందుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఒకే భాషకు పరిమితం కావడం కెరీర్‌పరంగా ఏమాత్రం శ్రేయస్కరం కాదనుకుంటున్నారు.
బేబమ్మ తమిళ అరంగేట్రం
‘ఉప్పెన’ చిత్రంలో నునులేత అందాలతో కుర్రకారుని ఉక్కిరిబిక్కిరి చేసింది మంగళూరు సోయగం కృతిశెట్టి. తొలి సినిమాతోనే యువతరం ఆరాధ్య నాయికగా మారిపోయింది. ఆ సినిమా విజయంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు వరుసకట్టాయి. ప్రస్తుతం శ్యామ్‌సింగరాయ్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఈ సొగసరి లింగుస్వామి-రామ్ చిత్రం ద్వారా తమిళంలో అరంగేట్రం చేస్తున్నది. రామ్ కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్న చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్నది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. నాయకానాయికలు రామ్, కృతిశెట్టిలకు ఇదే తొలి తమిళ సినిమా కావడం విశేషం. ఈ సినిమా ద్వారా తమిళంలో కూడా అవకాశాల్ని అందిపుచ్చుకుంటాననే ఆశాభావంతో ఉంది కృతిశెట్టి.
శాండిల్‌వుడ్‌లో మెహరీన్
హిందీలో నయనోదయం
మలయాళీ సుందరి నయనతార ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో దక్షిణాదిన తనదైన ముద్రతో దూసుకుపోతున్నది. ప్రస్తుతం మహిళా ప్రధాన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అగ్రహీరోలతో సమానంగా ఆమెకు ఫాలోయింగ్ ఉందనటం అతిశయోక్తి కాదు. ఇప్పటికే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ అమ్మడు తొలిసారి బాలీవుడ్‌లో అడుగుపెడుతూ అగ్రహీరో షారుఖ్‌ఖాన్‌తో జోడీగా నటిస్తున్నది. తమిళ టాప్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షారుఖ్‌ఖాన్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. మహిళాసాధికారత అంశాన్ని కమర్షియల్ పంథాలో చర్చిస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. హిందీ అరంగేట్రంలోనే షారుఖ్‌ఖాన్ సరసన నటించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకొని అందరి దృష్టిని ఆకట్టుకుంది నయనతార.
పాయల్ ‘హెడ్‌బుష్’
హిందీ బుల్లితెర ధారావాహికల్లో ఓ వెలుగువెలిగింది పంజాబీ అమ్మడు పాయల్‌రాజ్‌పుత్. ఆ తర్వాత హిందీ, పంజాబీ చిత్రాల ద్వారా కథానాయికగా పరిచయమైంది. అయితే ఈ సుందరికి వెండితెరపై బ్రేక్ లభించింది మాత్రం తెలుగు చిత్రం ‘ఆర్.ఎక్స్.100’ ద్వారానే. టాలీవుడ్‌లో ‘వెంకీమామ’ ‘డిస్కోరాజా’ సినిమాలు పాయల్‌కు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. తెలుగు, హిందీ, పంజాబీ భాషల్లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న ఈ సుందరి ‘హెడ్‌బుష్’ చిత్రం ద్వారా కన్నడ చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్నది. ధనంజయ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో పాయల్‌రాజ్‌పుత్ క్యాబరే డ్యాన్సర్‌గా కనిపించనుంది. ఈ సినిమా తనకు పాన్‌ఇండియా తారగా గుర్తింపును తీసుకొస్తుందని పాయల్‌రాజ్‌పుత్ ఆనందం వ్యక్తం చేసింది.
రష్మిక డబుల్ బోనాంజ
సమకాలీన తెలుగు కథానాయికల్లో తిరుగులేని స్టార్‌డమ్‌తో దూసుకుపోతున్నది కన్నడ కస్తూరి రష్మిక మందన్న. ‘ఛలో’ ‘గీతగోవిందం’ ‘భీష్మ’ చిత్రాలు ఆమె స్థానాన్ని సుస్థిరం చేశాయి. ప్రస్తుతం ‘పుష్ప’ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ వంటి భారీ సినిమాల్లో నటిస్తున్నది. ఇటు తెలుగుతో పాటు తమిళ, కన్నడంలో కూడా మంచి ఆఫర్లను కైవసం చేసుకుంటున్న ఈ కూర్గ్ సోయగం ‘మిషన్ ముజ్ను’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గుడ్‌బై’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నది రష్మిక మందన్న. ఇటు దక్షిణాదితో పాటు బాలీవుడ్‌పై దృష్టిపెడుతూ పాన్‌ఇండియా కథానాయికగా ఎదిగే ప్రయత్నాల్లో ఉంది. తెలుగు సుందరి ఈషారెబ్బా ‘ఓట్టు’ అనే రోడ్‌మూవీ ద్వారా మలయాళంలో అరంగేట్రం చేస్తున్నది.