సాగు చట్టాలను కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇది రైతుల విజయమని చెప్పారు. దేశంలో వాస్తవ పరిస్థితిని మోదీ సర్కార్ ఇప్పటికైనా గుర్తించిందన్నారు. దేశ రైతాంగానికి, ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పడం హుందాగా ఉందన్నారు. రైతు పోరాటాలకు ముందే నిర్ణయం తీసుకుంటే బాగుండేదని తెలిపారు.
ఆలస్యమైనా సముచితమైన నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వణికించే చలిలో కూడా ఉద్యమం చేసిన రైతులకు అభినందనలు తెలిపారు. అసువులుబాసిన రైతులకు కన్నీటి నివాళులర్పిస్తున్నామని చెప్పారు.ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి మించి మరేదాన్ని పాలకులు ప్రామాణికంగా తీసుకోవడానికి వీళ్లేదన్నారు.
ధాన్యం కొనుగోలుకు సంబంధించి టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన మహాధర్నా, తెలంగాణ రైతాంగం నిరసనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుందని చెప్పారు. సీఎం కేసీఆర్ పోరాట స్ఫూర్తి ప్రధాని మోదీకి తెలుసునని చెప్పారు. రైతుల ఉద్యమం ఉధృత రూపం దాల్చకముందే ధాన్యం కొనుగోళ్లలోనూ కేంద్రం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు