నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ఇవాళ ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో.. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. అధికారంలో ఉన్నవారి శక్తి కన్నా.. ప్రజాశక్తియే ఎప్పటికీ గొప్పదని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రైతుల చట్టాలను వ్యతిరేకించడంలో తెలంగాణ సర్కార్ ముందున్న విషయం తెలిసిందే. కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఆందోళన కూడా చేపట్టింది.
అయితే ట్విట్టర్ వేదిక ద్వారా మంత్రి కేటీఆర్ ఇవాళ రియాక్ట్ అయ్యారు. భారతీయ రైతులు మరోసారి తమ సత్తాను చాటారని, అవిశ్రాంత పోరాటం వల్ల తమ డిమాండ్లను సాధించుకున్నట్లు కేటీఆర్ తన ట్వీట్‌లో తెలిపారు.
ఆ కామెంట్‌కు ఆయన విజయసూచిక ఉన్న ఎమోజీని కూడా పోస్టు చేశారు. జైకిసాన్, జై జవాన్ అంటూ తన ట్వీట్‌లో మంత్రి కామెంట్ చేశారు. ఫార్మ్‌లాస్‌రిపీల్డ్, టీఆర్ఎస్ విత్ ఫార్మర్స్, ఫార్మర్స్ ప్రొటెస్ట్ హ్యాష్‌ట్యాగ్‌లను కూడా మంత్రి తన ట్వీట్‌లో పోస్టు చేశారు.