అద్భుతమైన పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం. ఈ క్రమంలో ఈ రోజు తెలంగాణ రైతాంగం ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, రైతుల ప్రయోజనాలను రక్షించుకోవాలని ఈ యుద్ధాన్ని ప్రారంభించాం అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నాలో కేసీఆర్ ప్రసంగించారు.
హైదరాబాద్ నగరంతో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. అవసరమైతే ఢిల్లీ వరకు కూడా యాత్ర చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడిదాకా అయినా సరే పోయి మన ప్రజల ప్రయోజనాలను రక్షించుకోవాలి. తెలంగాణ పోరాటాల గడ్డ, విప్లవాల గడ్డ. తనను తాను రక్షించుకోవాలనో తెలుసు. పరాయి పాలకుల విష కౌగిలి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని ఒక అద్భుతమైన పద్ధతిలో ముందుకు పోతున్నాం. తెలంగాణ రైతాంగానికి అశనిపాతంలాగా ఈ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు దాపరిస్తున్నాయి. వాటిని ఎదర్కోవడానికి, కండ్లు తెరిపించడానికీ ఈ యుద్ధానికి శ్రీకారం చుట్టాం.
ఈ దేశాన్ని నడిపించే నాయకులు చాలా సందర్భాల్లో వితండవాదాలు చేశారు. ఇటీవల నియోజకవర్గాల్లో జరిపిన ధర్నాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూర్చున్నారు. ప్రభుత్వమే ధర్నాకు కూర్చుంటుందా? అని ప్రశ్నించారు. 2006లో గుజరాత్ సీఎం, నాటి ప్రధాని మోదీ 51 గంటలు సీఎం హోదాలో ధర్నాకు కూర్చున్నారు. ఆయన పీఎం అయిన తర్వాత ధర్నాలు చేసే పరిస్థితులు కల్పించారు. సీఎంలు, మంత్రులు ధర్నాలో కూర్చునే పరిస్థితి మోదీ విధానాల వల్లనే వచ్చింది. కేంద్రం సమస్యను పరిష్కరిస్తే ధర్నాల అవసరం ఉండదు. ఈ పోరాటం భవిష్యత్‌లోనూ కొనసాగుతోంది అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.