కరోనా అనంతరం పున:ప్రారంభమైన సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సమస్యలు, సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం రోజున హైదరాబాద్ గౌలిదొడ్డి లోని సాంఘిక సంక్షేమ గురుకుల (సెంటర్ ఫర్ ఎక్సలెన్స్) బాలికల మరియు బాలుర పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలోని తరగతి గదులు, హాస్టల్ భవనం, మెస్ హాల్, బాత్రూంలు సందర్శించారు. అనంతరం అక్కడి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ఇతర సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు..
అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో విద్య గొప్పదనం, ప్రాముఖ్యత గురించి మాట్లాడి విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో కడు పేదరికంలో మగ్గుతున్న పేద ఎస్సీ-ఎస్టీ-బీసీ-మైనార్టీ మరియు ఆర్దికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులను ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడి విజయం సాధించేలా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు వారికి బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివే వారికి మాత్రమే మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు వచ్చేవి కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు అందరికీ కేజి టూ పీజీ నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనే ధృఢ సంకల్పం వల్ల నేడు సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విద్యార్థులు ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, ఐఐటీ, ట్రిపుల్ ఐటి వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు పొందుతున్నారు.
గత సంవత్సరం నిర్వహించిన నీట్ పరీక్షలో ఎంబీబీఎస్-241 మంది, బీడిఎస్-30 మంది, నిట్-49 మంది, ట్రిపుల్ ఐటీల్లో 19 మంది, ఐఐటీల్లో 86 మంది సీట్లు పొందడం నిజంగా గర్వించదగ్గ విషయం,ఇది తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ గురుకులాల పట్ల వహిస్తున్న ప్రత్యేక శ్రద్దకు తార్కాణం. దేశంలో వెయ్యికి పైగా గురుకులాలను పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని, ఇంకా భవిష్యత్ లో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటున్న సంక్షేమ గురుకుల విద్యాసంస్థలను అద్భుతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ తనిఖీల్లో మంత్రి గారి వెంట జే.ఎస్- కే.శారద, ఓఎస్డీ- ఏవి.రంగారెడ్డి, ఐఐటీ అకాడెమీ – కే.సత్యనారాయణ, సిఓఈ- ఏ.శారద తదితరులు ఉన్నారు