పుష్కరం పాటు ఒక జాతి మొత్తాన్ని ఏకం చేసి పదమూడేళ్లపాటు మహోద్యమాన్ని నడిపి, ఆ ఉద్యమ ఫలాన్ని అందుకున్న ఏకైక నాయకుడు భారతదేశంలో స్వాతంత్య్రానికి ముందు, స్వాతంత్య్రానికి తరువాత ఒక్క కేసీఆర్ మాత్రమే అనేది జగమెరిగిన సత్యం. ప్రత్యేకరాష్ట్రం సిద్ధించిన తరువాత ప్రశాంతంగా పాలన చేసుకుంటూ రాష్ట్రాన్ని స్వల్పకాలంలోనే దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుంది.
అలాంటి దార్శనికుడు మళ్ళీ మరోసారి ఉద్యమబాట పట్టి కేంద్రం కర్రపెత్తనం మీద కొరడా ఝళిపించారు. అంబానీ, అదానీల సేవలో జన్మను సార్ధకం చేసుకుంటూ, వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి కళ్ళముందే విదేశాలకు చెక్కేస్తుంటే ఏమీ తెలియని అమాయకత్వం నటిస్తున్న మోడీ ప్రభుత్వం దేశానికి అన్నం పెట్టే రైతుల మీద పగబట్టినట్లు వ్యవహరించడం, ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తూ అవమానాలపాల్జేస్తు, తెలంగాణ రైతుల పొట్టగొట్టడానికి బరితెగించిన వైఖరిని నిరసిస్తూ కేసీఆర్ కన్నెర్ర చేశారు.
రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్రాన్ని ఒప్పించాల్సిన రాష్ట్ర బీజేపీ నాయకులు, కేవలం కేసీఆర్ మీద వ్యక్తిగత కక్షతో రైతుబాంధవుడుగా జేజేలు అందుకుంటున్న కేసీఆర్ ను బద్నామ్ చెయ్యడానికి రైతులను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకోవాలనుకోవడం అత్యంత శోచనీయం. రైతులకు కేసీఆర్ సర్కార్ చేసినంత మేలు దేశంలో ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనూ జరగడంలేదని మోడీ సర్కార్కు కూడా తెలుసు. స్వయంగా ఎవుసం చేసే కేసీఆర్ కు రైతుల ప్రయోజనాల కోసం ఎలా పనిచేయాలో నేర్చుకోవాలా? చేపపిల్లకు ఈత నేర్పినట్లు బీజేపీ అంగుష్ఠమాత్రులు పదేపదే రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ రైతులను రెచ్చగొట్టడం ఏమాత్రం సహించరానిది.
బీజేపీ నాయకుల తీరు తెలుసు కాబట్టే బండి సంజయ్ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా రైతులు తిరగబడుతున్నారు. చెప్పులు చూపిస్తున్నారు. బీజేపీ వైఖరి పట్ల సీరియస్ అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి మరొకసారి ఉద్యమస్ఫూర్తిని రగిలిస్తూ కేంద్ర సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టారు. కేసీఆర్ కు సంఘీభావం తెలుపుతూ లక్షలాదిమంది అన్నదాతలు రోడ్లెక్కి బీజేపీ ద్వంద్వవైఖరిని ఎండగట్టబోతున్నారు.
కేసీఆర్ ఆగ్రహజ్వాలలు, రైతన్నల కడుపుమంట బీజేపీని భస్మం చెయ్యడం ఖాయం.