కొద్ది రోజుల క్రితం , హిందూ మక్కల్ కట్చి అని పిలువబడే ఒక హిందూవాడ సంస్థ విజయ్ సేతుపతిని తన్నిన వారికి రూ. 1,001 బహుమతిని ప్రకటించడం సంచలనంగా మారింది. విజయ్ సేతుపతి చేసిన పనికి క్షమాపణలు చెప్పే వరకూ ఆయనను తన్నిన వారికి 1 కిక్ = రూ. 1001/- అంటూ పోస్ట్ చేశారు.
ఇక ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్యని తన్నిన వారికి లక్ష రూపాయల నజరానా అని ప్రకటించారు. వన్నియార్ అనే సామాజిక వర్గాన్ని జై భీమ్ చిత్రంలో సూర్య అవమానించారని, ఆయన క్షమాపణలు చెప్పి నష్ట పరిహారం కింద ఐదు కోట్ల రూపాయలను ఇవ్వాలని వన్నియార్ సంఘ ప్రతినిధులు కోరుతూ నోటీసులు ఇచ్చారు. ఇదే క్రమంలో సూర్య పై దాడి చేసిన వారికి లక్ష రూపాయలను ఇస్తామంటూ పీఎంకే పార్టీ నేతలు ప్రకటించారు.
కేంద్ర మాజీ మంత్రి, పీఎంకే నేత అన్బుమణి సూర్యకు ఓ లేఖ రాశారు. దానికి సూర్య కూడా స్పందించారు. ఏదో ఒక వర్గాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని ఆయన తెలిపారు. తను సమాజంలో అందరి పట్ల ఒకేలా ప్రవర్తిస్తానని కూడా సూర్య పేర్కొన్నారు. సూర్యను ఆయన అభిమానులే కాదు విజయ్, ప్రభాస్ ఇలా అందరి హీరోల అభిమానులు అండగా నిలబడుతున్నారు. జైభీమ్ చిత్రంలో సామాజిక అసమానతలపై పోరాటం చేసిన లాయర్ చంద్రు పాత్రలో సూర్య నటించారు.