వరి ధాన్యం కొనబోమని కేంద్రం కొర్రీలు పెడుతుండటంతో రాష్ట్ర సర్కారు అన్నదాతలను ఆదాయం వచ్చే పంటల వైపు మరల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు పంట మార్పిడికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ముస్తాబాద్ మండలంలోని మోహినికుంట, మొర్రాయిపల్లె గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు కొత్త పంటల సాగుకోసం ప్రణాళికలు వేసుకుంటున్నారు. తాజాగా తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లోని పలువురు రైతులు పంట మార్పిడి చేసుకుంటున్నారు. ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. వరికి బదులు మక్కజొన్న, హైబ్రిడ్ కంది, పొద్దు తిరుగుడు పంటలు వేయడంలో నిమగ్నమయ్యారు. వల్లంపట్లలో కొందరు కూరగాయలు, ముస్కానిపేటలో పొద్దు తిరుగుడు, కేశన్నపల్లిలో హైబ్రిడ్ కంది, గొల్లపల్లి, వెంకట్రావుపల్లిలో శనగ వేస్తూ ప్రభుత్వ సూచనలు పాటిస్తున్నారు.
‘ఆదాయం వచ్చే పంటలు సాగు చేయండి’ అన్న సీఎం కేసీఆర్ మాటతో అనేక ఊళ్లు ఆ దిశగా కదులుతున్నాయి. వరికి బదులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు హైబ్రిడ్ కంది, పొద్దు తిరుగుడు తదితర పంటలు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. పంటల మార్పిడితో రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచేలా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల రైతులు ఏకగ్రీవ తీర్మానాలు చేయగా.. తాజాగా తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లోని మరిన్ని ఊర్లు ఇదే తోవలో నడిచొస్తున్నాయి.
ఒక్క మాటతో పంట మార్పిడి
..ఈ చిత్రంలోని యువ రైతు పేరు నెల్లుట్ల మనోహర్. తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామం. ఇతని కుటుంబానికి మూడెకరాల పొలం ఉన్నది. మనోహర్ డిగ్రీ వరకు చదివి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఈ ఏడాది ఆగస్టులో తండ్రి రాజమల్లు మృతి చెందడంతో ఊరికి తిరిగి వచ్చాడు. ఉన్న మూడెకరాల్లో తండ్రి బాటలోనే వ్యవసాయం చేస్తున్నాడు. వానకాలం వరిసాగు చేశాడు. యాసంగిలోనూ వరిసాగు చేయాలనుకున్నాడు. కానీ, సీఎం కేసీఆర్ పిలుపుతో పంట మార్పిడికి సిద్ధమయ్యాడు. ఎకరన్నరలో మక్కజొన్న, మిగతా భూమిలో క్యాలీఫ్లవర్, క్యాబేజీ, అల్చంతకాయ, చిక్కుడు, ఇతర కూరగాయ పంటలు వేస్తున్నాడు.
కూరగాయలు వేస్తున్నా
మొన్నటి దాకా వరి వేసినం. కేంద్రం ధాన్యం కొనేది లేదని తేల్చడంతో ఇతర లాభసాటి పంటలు వేసుకోవాలని కేసీఆర్ సార్ చెప్పిండు. అందుకే ఆదాయం వచ్చే పంటలు వేసుకుంటున్న. ఎకరన్నరలో మక్కజొన్న, మిగతా భూమిలో కూరగాయలు వేస్తున్న. రైతులంతా ఇలాగే ఆలోచన చేయాలె. పంట మార్పిడి మనకే మంచిది. తర్వాత ఆగం కావొద్దు.- నెల్లుట్ల మనోహర్, చీర్లవంచ, తంగళ్లపల్లి మండలం.సిరిసిల్ల రైతు కొత్తబాట
వరికి బదులు ఇతర పంటలు
నాకు నాలుగెకరాల పొలం ఉన్నది. వానకాలంలో రెండెకరాల్లో వరి, ఎకరం కూరగాయలు, ఎకరంలో ఇతర పంటలు వేసిన. ప్రభుత్వం యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు వేయాలని చెప్పడంతో ఇప్పుడు మరో ఎకరంలో మక్కజొన్న వేసిన. ఇంకో ఎకరంలో కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తున్న. – జీడికంటి రాజు, రైతు, ముస్కుపల్లి, ఇల్లంతకుంట మండలం