తెలంగాణను దోచుకునేందుకు గుజరాత్ పాలకులు కుట్రలు పన్నుతున్నారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్రలు చేసి వ్యవసాయ చట్టాలకు మెలికపెట్టి రైతులను ఇబ్బందులు పెడుతున్నదని విమర్శించారు. నల్లగొండ టౌన్ ఆర్జాల బావి ఐకేపీ కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు పండించిన ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. రైతుల కోసం సీఎం అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు.
వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఎమ్మెల్యే చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పంట పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను కొంటున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని తెలిపారు.
రైతులకు తాము ఉచితంగా కరెంటు ఇస్తుంటే మోదీ సర్కార్ మీటర్లు పెడతామంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బండి సంజయ్‌కి దమ్ముంటే యాసంగి వడ్లు కొంటామని ప్రధాని మోదీతో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. బండి.. తొండి.. మొండి నాయకుల మాటలను రైతులు, ప్రజలు నమ్మొద్దని సూచించారు.