కన్నడ పవర్‌స్టార్ పునీత్‌రాజ్‌కుమార్ మరణానంతరం నేత్రదానం చేసిన నేపథ్యంలో.. దేశంలో తొలిసారిగా పదిమందికి చూపునిచ్చేలా నారాయణ నేత్రాలయ ఆస్పత్రి ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. శనివారం బెంగళూరులో నారాయణ నేత్రాలయ చీఫ్ డాక్టర్ భుజంగశెట్టి మాట్లాడుతూ.. పునీత్ కార్నియా ద్వారా ఇప్పటికే నలుగురికి చూపు లభించిందన్నారు.
ఆయన స్టెమ్ సెల్స్ ద్వారా 5 నుంచి 10 మందికి చూపునిచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. వీటిని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నామని నేత్రాలయ డాక్టర్ యతీశ్ చెప్పారు. ఇందుకు 2 వారాల సమయం పడుతుందని, ఆ తర్వాత అమర్చే ప్రక్రియ జరుగుతుందన్నారు.
పునీత్ స్టెమ్‌సెల్స్ ల్యాబ్‌లో ఉంచి అభివృద్ధి చేస్తున్నామని, వచ్చేవారంలో అమరుస్తామన్నారు. అవసరమైన వారిని గుర్తించడానికి డాక్టర్ రాజ్‌కుమార్ ఐ బ్యాంక్ సహకారం తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ ప్రయత్నం దేశంలోనే తొలిసారి అని వెల్లడించారు.