బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ బిల్లు పాసైనప్పుడు కేసీఆర్ ఓటేయలేదు అని బండి సంజయ్ అంటున్నాడు.ఆయన మాటలు వింటుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు. తెలంగాణ ఉద్యమంలో నువ్వెక్కడ. నువ్వు ఎవ్వనికి తెలుసు ఈ రాష్ట్రంలో. నీ పత్తానే లేదు. ఇప్పుడొచ్చి దుంకుతా అంటే నడవదు.
కథ తేల్చే దాకా నేనే మాట్లాడుతా. వదిలిపెట్టను. ప్రతి రోజు మాట్లాడుతా. గారడీ చేస్తామంటే నడవనివ్వను. తెలంగాణకు ఏం చేసినావో చెప్పు అంటడు ఈ మొగోడు. తెలంగాణలో ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అందుతోంది. నీ ఇంటికి కూడా మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి కదా?.దేశాన్ని నడిపే పార్టీ అధ్యక్షుడు.. నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు.
గొర్రెల పైసల్లో ఒక్క పైసా కేంద్రానిది ఉందని తేలితే నేను ఒకటే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేస్తాను. నేషనల్ కో ఆపరేటివ్ బ్యాంక్ వద్ద గొర్రెల పథకానికి పైసలు అప్పుగా తీసుకున్నాం. వడ్డీతో సహా తిరిగి కడుతున్నాం. నీవు ఇచ్చింది ఏం తోక. అబద్దాలు మాట్లాడటం సరికాదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలో కూడా తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, పెన్షన్లు ఇస్తున్నారా? పెట్రోల్, డీజిల్ ధరలపై మాట్లాడితే పక్క దేశాలకు పోవాలని అంటున్నారు. అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు అని కేసీఆర్ మండిపడ్డారు.