భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బండి సంజయ్ ఇవాళ మాట్లాడుతూ.. తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. మిగతా విషయాలన్ని మాట్లాడిండు. వడ్ల గురించి మాట్లాడకుండా.. సొల్లు పురాణం మాట్లాడిండు అని కేసీఆర్ ధ్వజమెత్తారు. దీన్ని బట్టే తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాలి. కేంద్రం మొండి వైఖరి వీడట్లేదు. రైతుల ఉద్యమాలు కొనసాగుతున్నాయి. గట్టిగా నిలదీస్తే దేశద్రోహి. మద్దతు ఇచ్చినప్పుడు దేశద్రోహులం కాదు. పలు బిల్లులకు మద్దతు ఇచ్చినప్పుడు దేశ ద్రోహులం కాదు.. గట్టిగా మాట్లాడి నిజాలు బయటపెట్టి ప్రజల పక్షాన నిలదీస్తే.. వాళ్లు దేశద్రోహులు. ఇది బీజేపీ స్టైల్. దేశంలో ఎవరూ నిలదీసినా.. ఉన్న విషయాలు కుండబద్దలు కొడితే వారు దేశద్రోహులు అయిపోతారు. రెండు, మూడు రకాలు స్టాంపులు తయారు చేశారు. ఇంకా గట్టిగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్.. ఇవన్నీ దేశంలో పరంపర కొనసాగుతున్నాయి.
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మాట్లాడుతూ.. రైతు చట్టాలు రైతులకు వ్యతిరేకం అని మాట్లాడారు. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా రైతులకు సంఘీభావం తెలిపారు. చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మేఘాలయ గవర్నర్, వరుణ్ గాంధీ కూడా దేశ ద్రోహులేనా? దేశం దురాక్రమణ జరగకూడదు. దాన్ని నిరోధించాలని చెబితే దేశ ద్రోహి అంటున్నారు. కేసీఆర్ చైనాలో డబ్బులు దాచుకున్నాడంటా? ఒక తల తోక లేదు. ఇష్టం వచ్చిన సొల్లును, ఇష్టం వచ్చినట్టు గుమ్మరించి మాట్లాడుతున్నారు. ధాన్యం ఎంత కొంటావో చెప్పాలి. పంజాబ్‌లో పూర్తిస్థాయి ధాన్యం సేకరిస్తున్నారు. తెలంగాణ వడ్లను కేంద్రం కొంటదా? కొనదా? అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షునిగా సీదా అడుగుతున్నా. సమాధానం చెప్పే వరకు బీజేపీని, కేంద్రాన్ని వదిలిపెట్టం.
ప్రజల కోసం ఉద్యమించిన వ్యక్తిగా, రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా, ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నాం. బీజేపీ నాయకుల్లాగా చీప్‌గా ప్రవర్తించాం. రాయలసీమకు నీళ్లు రావాలని చెప్పాను. ఇవాళ కూడా చెప్తున్నా. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్‌కు చెప్పాను. రాజకీయాలు అవసరం ఉన్నప్పుడల్లా కేంద్రం డ్రామాలు ఆడుతోంది. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని నేడు కూడా చెబుతున్నాను. బేసిన్లు, భేషజాలు ఉండొద్దని ఏపీ సీఎంకు చెప్పాను. పక్క రాష్ట్రంలో చేపల పులుసు తింటే తప్పా? వ్యక్తిగత దూషణాలు సరికాదు అని కేసీఆర్ అన్నారు.