తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని, రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. సోమవారం వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలం తిరుమరాయపల్లి, రాయపర్తి గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు మంత్రి. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా ప్రతిగింజను కొనుగోలు చేస్తామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం మాత్రం దొడ్డు రకం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తుందని విమర్శించారు. అయినప్పటకీ రైతుకు నష్టం కలగకుండా మద్దతు ధర కల్పించి ధాన్యం కోనుగోలు చేస్తుందని చెప్పారు.రైతులను ఆగం చేసి బీజేపి రాజకీయ లబ్ధిపొందాలని కుట్రలు చేస్తుందన్నారు. వ్యవసాయ బావుల వద్ద కేంద్రం కరెంట్ మీటర్లు పెట్టాలని చూస్తోందని విమర్శించారు. ఢిల్లీ బీజీపీ వడ్లు కొనం అంటుంటే.. గల్లీ బీజీపీ వడ్లు కొనాలని లొల్లి చేస్తోందన్నారు.
వారి మాటలు రైతులు ఆగం కావద్దని, ప్రత్యామ్నాయ, లాభసాటి పంటలను సాగుచేయాలని సీఎం కేసీఆర్ సూచిస్తున్నారని అన్నారు. రైతాంగం వచ్చే యాసంగిలో వరి పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలైన పల్లి, పామాయిల్, ఇతర లాభదాయక పంటలు సాగు చేసేవిధంగా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ అధికారులను కోరారు.