శాసన మండలి కొత్త చైర్మన్‌గా పార్టీ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారికి అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధుసూదనాచారికి ఒక బెర్త్ కేటాయించడంతో పాటు, కీలకమైన మండలి చైర్మన్ పదవి ఇవ్వడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం.
ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం ఇప్పటికే విడుదలైన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9న నోటిఫికేషన్ జారీ కానుంది. సంఖ్యా బలం దృష్ట్యా ఆరు స్థానాలనూ టీఆర్‌ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకోవడం లాంఛనమే. దీనికితగినట్లుగా సీఎం కేసీఆర్.. అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించారని, ఉద్యమ నేపథ్యం, తాజా రాజకీయ-సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటున్నారని తెలిసింది.
ఈ కసరత్తు చివరి దశకు చేరినట్లు పార్టీ ముఖ్యుల్లో ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీగా, శాసన మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి జూన్‌లో విరమణ చేసినప్పటి నుంచి మండలి పూర్తి స్థాయి చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుతం వి.భూపాల్‌రెడ్డి ప్రొటెం చైర్మన్‌గా కొనసాగుతున్నారు.