మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన మల్టీస్టారర్ సినిమా ‘ఆచార్య’. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తుండగా, పూజా హెగ్డే తన సరసన నటించింది. తాజాగా చరణ్, పూజాలపై చిత్రీకరించిన ‘నీలాంబరి’ లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్రబృందం వదిలింది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ‘లాహే లాహే’ లిరికల్ సాంగ్ పెద్ద హిట్ అయింది. ఇప్పుడు వచ్చిన ‘నీలాంబరి’ కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈ సాంగ్‌లో చరణ్, పూజాల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. వి.జే శేఖర్ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ అందించారు.
శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అంటే ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పకర్లేదు. ఆ కొరియోగ్రఫీకి చెర్రీ డ్యాన్స్ తోడయితే ఆ కిక్కే వేరేగా ఉంటుంది. ఇక ఈ పాటలో క్లాసికల్ డ్యాన్స్ చేశాడు. అయితే ఇప్పటి వరకూ క్లాసికల్ డ్యాన్స్ ఆయన చేయలేదు. ఈ స్టెప్స్‌తో చిరు ‘ఆపద్భాందవుడు’ పాటలోని డ్యాన్స్‌ను గుర్తు చేస్తున్నాడని మెగాభిమానులు మురిసిపోతున్నారు. పాటే ఈ రేంజ్‌లో ఉంటే సినిమాలో చెర్రీ క్యారెక్టర్, ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలని వేయి కళ్లతో వేచి చూస్తున్నామని అభిమానులు చెబుతున్నారు.
ఇక పూజా హెగ్డే లంగా ఓణీలో చాలా అందంగా మెరిసింది. ఈ సాంగ్‌కు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్ర పాడారు. ఈ పాట చూసిన నెటిజన్లు అలనాటి పాటలు గుర్తు చేసేలా ఉందని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తంగా నీలాంబరి సాంగ్ యూట్యూబ్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కాగా ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. సంగీత, రెజీనా స్పెషల్ సాంగ్స్‌లో సందడి చేయబోతున్నారు.