లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించిన పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కార్యకలాపాలకు భారతీయ నగరాలు ప్రపంచంలోనే అత్యంత కీలకంగా మారాయి. వీటిలో హైదరాబాద్ ప్రపంచ ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో ఉన్నట్టు అంతర్జాతీయ అధ్యయన సంస్థ ‘ఎఫ్‌డీఐ బెంచ్‌మార్క్’ వెల్లడించింది. ఈ ర్యాంకింగ్స్‌లో నోయిడా అగ్రస్థానంలో నిలిచిందని, హైదరాబాద్ తర్వాత 3 నుంచి 6 స్థానాల్లో వరుసగా చెన్నై, గుర్గావ్, పుణే, బెంగళూరు ఉన్నాయని తాజా నివేదికలో పేర్కొన్నది.
కొవిడ్ వ్యాప్తితో వైద్యారోగ్య రంగంలో ఆర్‌అండ్‌డీ కార్యకలాపాలు కీలకంగా మారాయి. ఈ రంగంలో పెట్టుబడులకు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు కంటే హైదరాబాద్ అత్యంత అనుకూలంగా ఉన్నదని, అందుకే పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపుతున్నాయని నివేదిక వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం.. లైఫ్ సైన్సెస్ రంగంలో ఎఫ్‌డీఐలతో 27 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఆర్‌అండ్‌డీ ల్యాబ్‌ల నిర్వహణ ఎంతో వ్యయభరితమైనది. ఈ నేపథ్యంలో తక్కువ నిర్వహణ వ్యయంతో నాణ్యమైన, ఖచ్చితత్వంతో కూడిన ఫలితాలను రాబట్టేందుకు భారతీయ నగరాలు ప్రపంచంలోని ఇతర నగరాల్లో పోటీపడుతున్నాయి.