తెలంగాణలో ఓటర్ల ముసాయిదా జాబితా-2022ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో రాజకీయ పార్టీలతో ఓటర్ల జాబితాపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానంతరం జిల్లాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశామని, వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించామని తెలిపారు. బూత్ లెవల్ ఆఫీసర్లను నియమించాలని, చనిపోయిన వారి ఓట్లు తొలగించాలని రాజకీయ పార్టీలు కోరాయని చెప్పారు.
కుటుంబసభ్యులంతా ఒకే దగ్గర ఉన్నప్పుడు ఓటు వేర్వేరు కేంద్రాల్లో వస్తున్నాయని, అలా రాకుండా అందరికీ ఒకే కేంద్రంలో ఓటు ఉండేలా చూడాలని కోరినట్టు తెలిపారు. 18 ఏండ్లు నిండిన ప్రతీఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఈ నెల 6, 7, 27, 28 తేదీల్లో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వివరించారు. ఓటర్ల తుది జాబితాను 2022 జనవరి 5న ప్రకటిస్తామని తెలిపారు.