టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. ఫ్యాన్స్ కోరిక మేరకు… త్వరలోనే మళ్లీ మైదానంలో అడుగుపెడతానని పేర్కొన్నాడు. అన్నీ సజావుగా సాగితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో క్రికెట్ ఫీల్డ్‌లో తనను చూసే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు తన వన్డే కెరీర్‌లో చివరిసారిగా, ఇంగ్లండ్‌పై సాధించిన సెంచరీ(150)కి సంబంధించిన వీడియోను ఇన్‌స్టా వేదికగా పంచుకున్న యువీ.. భావోద్వేగ క్యాప్షన్ జతచేశాడు.
‘‘ఆ దేవుడే నీ గమ్యాన్ని నిర్దేశిస్తాడు!! పబ్లిక్ డిమాండ్ మేరకు ఫిబ్రవరిలో మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇంతకు మించిన గొప్ప అనుభూతి ఇంకోటి ఉండదు! మీ ప్రేమ, ఆదరాభిమానాలకు కృతజ్ఞుడిని! మీ మద్దతు ఇలాగే కొనసాగాలి. నిజమైన అభిమాని… కఠిన సమయాల్లో మనకు మద్దతుగా ఉంటారు’’ అని కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.
ఇందుకు స్పందించిన నెటిజన్లు… ‘‘పా.. జీ.. నీ రాక కోసం ఎదురుచూస్తున్నాం. మళ్లీ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొడితే చూడాలని ఉంది’’అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా క్యాన్సర్ బారిన పడి కోలుకున్న.. యువరాజ్ సింగ్ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కాగా ఫిబ్రవరిలో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ జరుగనున్న నేపథ్యంలో ఆ టోర్నీ గురించే యువీ పోస్టు చేశాడని అభిమానులు అంటున్నారు.
అయితే.. మరికొంత మంది మాత్రం ఇప్పటికే తను ఈ టోర్నీలో ఆడాడని.. అలాంటప్పుడు మళ్లీ కొత్తగా చెప్పడానికి ఏముందని.. ఇంకేదో విశేషం ఉండే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఇండియా లెజెండ్స్ తరఫున యువీ మైదానంలో దిగిన సంగతి తెలిసిందే.