‘దేశాన్ని సాకుతున్న నాలుగైదు అతిపెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి’ అని సీఎం కేసీఆర్ పదేపదే చెప్తుంటారు.కేంద్ర ప్రభుత్వ నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఓ జాతీయ పత్రిక చేసిన విశ్లేషణలో సైతం ఆర్థిక శక్తులుగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణను ఒకటిగా తేల్చింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ర్టాలతో పోల్చితే దక్షిణాది రాష్ర్టాలు బలంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ విశ్లేషణలో దేశాన్ని తూర్పు, పశ్చిమ, మధ్య (సెంట్రల్), దక్షిణ, ఉత్తర రీజియన్ల పేర్లతో ఐదు భాగాలుగా విభజించారు.ఈ రీజియన్లలోని రాష్ర్టాల జీఎస్డీపీ, జనాభా తదితర అంశాల ఆధారంగా జరిపిన విశ్లేషణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
మధ్య భారత రీజియన్‌లోని తెలంగాణ, మహారాష్ట్ర, గోవా రాష్ర్టాల జీఎస్డీపీ తూర్పు రీజియన్‌లోని 13 రాష్ర్టాల జీఎస్డీపీ కంటే దాదాపు రూ.1.5 లక్షలకోట్లు ఎక్కువ. అదే సమయంలో జనాభా దాదాపు సగం తక్కువగా ఉన్నది. తలసరి ఆదాయం సైతం రెట్టింపు నమోదైంది.సాధారణంగా తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ర్టాలను కలిపి దక్షిణాదిగా పిలుస్తుంటారు. వీటి జీఎస్డీపీ సంయుక్తంగా సుమారు రూ.40 లక్షల కోట్లకుపైమాటే. ఏపీని మినహాయిస్తే మిగతా నాలుగు రాష్ర్టాలు బలమైన ఆర్థిక రీజియన్లలో ఉన్నాయి.తలసరి ఆదాయం పరంగానూ దక్షిణాది రాష్ర్టాల సగటు రూ.1.7 లక్షలుగా నమోదైంది.
అదేమసయంలో ఉత్తరాది సగటు కేవలం లక్ష రూపాయలే.ఐదు రీజియన్లలో అత్యధిక తలసరి ఆదాయం మధ్య, దక్షిణ భారత రీజియన్లలో (రూ.1.70 లక్షలు) నమోదైంది. ఇందులో తెలంగాణ సహా 4 రాష్ర్టాలు ఉండటం విశేషం.8 రాష్ర్టాలతో కూడిన ఉత్తర భారత రీజియన్ తలసరి ఆదాయం కేవలం రూ.60 వేలే. అదే సమయంలో జనాభా పరంగా మధ్య రీజియన్‌తో పోల్చితే 291% అధికంగా ఉన్నది.గత 7 ఏండ్లలో తెలంగాణ ప్రభుత్వం నిర్ధిష్ట ప్రణాళికలు రూపొందించి, అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైందని నిపుణులు చెప్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచడం, విప్లవాత్మక విధానాల ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం లాంటి చర్యల ఫలితంగా దేశంలోని బలమైన రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచిందన్నారు.
తూర్పు: ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మేఘాలయ, అసోం, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం.
పశ్చిమ: గుజరాత్, రాజస్థాన్, హర్యానా.
మధ్య: తెలంగాణ, మహారాష్ట్ర, గోవా.
ఉత్తర: లడఖ్, జమ్ముకశ్మీర్, పంజాబ్, బీహార్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్.
దక్షిణ: కేరళ, తమిళనాడు, కర్ణాటక.