టెక్నాలజీ రంగంలో వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘ప్లగ్ అండ్ ప్లే’ టెక్ సెంటర్ సుముఖత వ్యక్తం చేసింది. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం పారి్‌సలోని ప్లగ్ అండ్ ప్లే కార్యాలయాన్ని సందర్శించి సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. దేశంలోనే ప్రముఖ స్టార్టప్ నగరంగా హైదరాబాద్ కొనసాగుతోందని, టి-హబ్, వి-హబ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోందని వారికి వివరించారు.
భారత్‌లో విస్తరించేందుకు హైదరాబాద్ అత్యంత అనువైన నగరమని సూచించారు. రూ.300 కోట్లతో 3.5 లక్షల చదరపు అడుగుల్లో చేపట్టిన టి హబ్-2 భవన నిర్మాణం పూర్తయిందని, ఇందులో ఒకేసారి 2వేల స్టార్ట్‌పలకు చోటు కల్పించే అవకాశముంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో కార్యాలయం ఏర్పాటు చేస్తే ప్రభుత్వం అన్నివిధాల సహకారం అందిస్తుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
దీనిపై సంస్థ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. భారత్‌లో తొలి కేంద్రాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పుతామని ప్లగ్ అండ్ ప్లే టెక్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ ఒమీద్ మెహిరిన్ఫర్ ప్రకటించారు. డిసెంబరు మొదటి వారంలో దీనిని ప్రారంభిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో జరుగనున్న కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు, సీఈవో సయిద్ అమీది పాల్గొంటారని చెప్పారు. కాగా, రాయదుర్గంలో టి హబ్-2 భవన నిర్మాణం పూర్తయింది. డిసెంబరు మొదటివారంలో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ప్లగ్ అండ్ ప్లే సంస్థకు ఈ భవనంలోనే స్థలం కేటాయించే అవకాశాలున్నాయి. ఆ వెంటనే కార్యకలాపాలను ప్రారంభించాలని ప్లగ్ అండ్ ప్లే భావిస్తోంది. తొలుత ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), స్మార్ట్ సిటీకి సంబంధించిన స్టార్ట్‌పలకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. అమెరికాలోని సియాటెల్ కేంద్రంగా ఉన్న ‘ట్రియాంగుళం ల్యాబ్స్’ స్టార్ట్‌పలకు ఆర్థిక సహకారం అందించనుంది. రవాణా, విద్యుత్తు, మౌలిక వసతుల అభివృద్ధి రంగంలోని స్టార్ట్‌పలనూ ప్రోత్సహించనుంది. రెండోవిడతలో ఆరోగ్యం, ఆర్థిక రంగాలపై దృష్టిసారించనుంది.