తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు,విలన్ గా వికట్టాహాసం చేసినా, కేరెక్టర్ యాక్టర్ గా కన్నీరు పెట్టించినా, కమెడియన్ గా కడుపుబ్బ నవ్వించినా ఆ ఘనత కైకాల సత్యనారాయణకే దక్కుతుంది. ఆరు దశాబ్ధాలుగా తెలుగు వారిని తన నటనతో అలరించిన కైకాల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఆయన జారిపడ్డారు.
కింద పడడం వలన నొప్పులు కాస్త ఎక్కువగా ఉండడంతో సికింద్రాబాద్లోని ప్రముఖ ప్రైవేటు హాస్పిటల్లో ఆయనను చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన పడాల్సి అవసరం లేదని కుటుంబసభ్యులు తెలిపారు.
కాగా, కైకాల సత్యనారాయణ పుట్టినరోజును పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి సత్యనారాయణ నివాసానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ‘తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు అంటూ కొనియాడారు. ఆయనతో కాసేపు ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి’… అని చిరు తన ట్విట్టర్ ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే.