హుజూరాబాద్ నియోజకవర్గానికి శనివారం జరిగిన ఉపఎన్నికలో ఓటర్లు పోటెత్తారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఓటు హక్కును వినియోగించుకొన్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో 84.39 శాతం పోలింగ్ నమోదుకాగా.. ఈసారి 86.33 % (కడపటి వార్తలు అందిన సమాచారం మేరకు) నమోదైంది. ఉదయం నుంచి పోలింగ్ గంటగంటకూ పెరుగుతూ వచ్చింది.
మధ్యాహ్నం సమయంలో బాగా పెరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు కొవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకొన్నారు. నిజానికి హుజూరాబాద్‌లో గతంలోనూ ఇతర నియోజకవర్గాలతో పోల్చితే పోలింగ్ అధికంగా ఉండేది. అదే చైతన్యాన్ని ఈసారి కూడా ఓటర్ల చూపించారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అధికారుల అంచనాల ప్రకారం 85% అయ్యే అవకాశాలున్నాయని అంచనాలు వేయగా, దానికి మించి పోలింగ్ జరిగింది.
నియోజకవర్గంలో మొత్తం 2,37,022 ఓట్లు ఉండగా ఇందులో 1,17,922 మంది పురుషులు, 1,19,099 మంది మహిళలున్నారు. ఒకరు ఇతరులున్నారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ జరిగింది. కరోనా నిబంధనల మేరకు ఈ ప్రక్రియ నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు చలి ఎక్కువగా ఉండడంతో మందకొడిగా సాగింది.
తొమ్మిది గంటల నుంచి ఓటర్లు ఎక్కువ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. రాత్రి ఏడు గంటల వరకు ఇదే తరహాలో కొనసాగింది. ఉపాధి, ఇతర అవసరాల కోసం ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు సైతం భారీగా తరలి వచ్చి ఓటువేశారు. పలు పోలింగ్ కేంద్రాల దగ్గర బీజేపీ నాయకులు, కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. టీఆర్‌ఎస్ శ్రేణులను, సామాన్య ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. వ్యక్తిగత పనులపై బయటికి వచ్చినవారి వాహనాలను అడ్డుకొని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు.