తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలోని దళిత కుటుంబాలకు దళితబంధు పథకం ఫలాలు అందాయి. బుధవారం పండుగ వాతావరణంలో యూనిట్ల పంపిణీని చేశారు. కూలీనాలీ చేసుకొంటూ జీవనం సాగించిన నిరుపేద దళిత కుటుంబాల వారు ఇప్పుడు ఓనర్లుగా మారి కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు.
వాసాలమర్రిలోని 76 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో గతంలోనే జమ చేశారు. తాజాగా వీరిలో ముగ్గురికి మహీంద్రా సరుకు రవాణా వాహనాలు, నలుగురికి అశోకా గూడ్స్ వాహనాలు, ఇద్దరికి ట్రాక్టర్ డోజర్, ఒకరికి ప్యాసింజర్ ఆటో మంజూరయ్యాయి.
లబ్ధిదారులకు ఆయా వాహనాల తాళాలను విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అందజేశారు. వాసాలమర్రిలోని రైతు వేదిక వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. తమ బతుకులు మార్చే ఈ రోజును, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జన్మలో మరిచిపోలేమని లబ్ధిదారులు తెలిపారు. ఇందుకు కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.