కొవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారానికి తెరదించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో బుధవారం సాయంత్రం ఐదు గంటల తరువాత హుజూరాబాద్‌లో మైకులన్నీ మూగబోనున్నాయి. స్థానికేతరులంతా నియోజకవర్గాన్ని విడిచిపోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఏ ఎన్నిక జరిగినా..
పోలింగ్‌కు 48 గంటల ముందు వరకు ప్రచారం చేసుకోవచ్చు. కానీ తాజాగా ఎన్నికల సంఘం మాత్రం ఈ గడువును 72 గంటలకు పొడిగించడం గమనార్హం. ఈసీ ఆదేశాలతో మామూలుగా 28 వ తేదీ వరకు కొనసాగాల్సిన ప్రచారం.. ఒకరోజు ముందుగానే ముగించాల్సి వస్తున్నది.
ఇప్పటికే నియోజకవర్గంలో 20 కంపెనీల పారామిలటరీ బలగాలను దింపారు. ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి సాధారణంగా ఒక వ్యయ పరిశీలకుడిని పంపాల్సి ఉండగా హుజూరాబాద్‌కు మాత్రం ఇద్దరిని పంపించారు. ఎక్కడా లేనివిధంగా నియోజకవర్గానికి పొరుగున ఉన్న జిల్లాల్లో బహిరంగ సభలు పెట్టవద్దంటూ అడ్వైజరీని జారీచేసింది. హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగే అస్కారం లేకుండా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలను ఈసీ ఎదుర్కొంటున్నది. అందువల్లనే ఇలాంటి నిర్ణయాలు తీసుకొంటున్నారన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతున్నది.