అబద్ధమాడినా అతికినట్టుండాలి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఈ కనీస సోయి కూడా లేనట్టుంది.. అందుకే ఏకంగా తెలంగాణ అమరవీరులను కేసీఆర్.. టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా స్మరించుకోలేదంటూ నీచమైన ప్రచారానికి ఒడిగట్టారు. టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశాన్ని ప్రపంచంలోని కోట్లమంది తెలంగాణ వాదులు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు.
కేసీఆర్ ఏం మాట్లాడారో.. సభలో ఏం జరిగిందో కండ్లారా చూశారు. సమావేశం ఘనంగా జరిగిన తీరు చూసి రేవంత్‌కు ఏం మాట్లాడాలో పాలుపోలేదేమో.. మీడియాను పిలిపించుకుని నోటికొచ్చినట్టు మాట్లాడటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.టీఆర్‌ఎస్ సమావేశంలో పార్టీ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్.. తెలంగాణకోసం జీవితాంతం తపించిపోయిన మహనీయులకు, ఉద్యమ వ్యూహకర్తలకు, తెలంగాణ కోసం ఆత్మాహుతితో తమను తాము సమర్పణం చేసుకొన్న అమరులందరికీ ఘనంగా నివాళులర్పించారు.
వారిని పేరుపేరునా స్మరించుకొన్నారు. కానీ.. కొండా లక్ష్మణ్‌బాపూజీ, జయశంకర్, విద్యాసాగర్‌రావు, శ్రీకాంతచారి వంటివారిని తలుచుకోలేదంటూ, అమరవీరులను గౌరవించలేదంటూ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్ తీరుపట్ల టీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు. రేవంత్ తన తెలివితక్కువతనాన్ని బయటపెట్టుకున్నారంటూ ఎద్దేవాచేస్తున్నారు.