కెనడాలో ఉన్న అత్యంత పెద్దదైన ఎత్తిపోతల పథకానికి మించి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ప్రపంచ రికార్డును అధిగమించారని ప్రముఖ సినీ నటుడు, దర్శక, నిర్మాత ఆర్ నారాయణమూర్తి అన్నారు. జనగామలో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో కలిసి ఓ థియేటర్‌లో ‘రైతన్న’ సినిమాను తిలకించారు.ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు దేశం కట్టింది కాదన్నారు. వేరుపడి బాగుపడుతున్న ఒక రాష్ట్రం సొంతంగా నిర్మించుకున్న అద్భుతమైన బహుళార్ధక కట్టడమని.. భవిష్యత్తులో ఇది తెలంగాణకు అక్షయపాత్ర కాబోతుందని తెలిపారు.
ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడిన దాఖలాలు లేవన్నారు. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలతో అన్నదాత అరిగోస ఎలా ఉంటుందో ‘రైతన్న’ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించానని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి రైతు, ప్రతి వ్యవసాయ కుటుంబం సినిమా చూడాలన్నారు. 50 ఏండ్లుగా సినిమాలు నిర్మిస్తున్నా ఏనాడూ ప్రజల మధ్యకు వచ్చి సినిమా చూడాలని అభ్యర్థించలేదని తెలిపారు. కేంద్రం బలవంతంగా రుద్దబోతున్న రైతు వ్యతికరే చట్టాలు అమలైతే రైతుల పరిస్థితి ఎంత దుర్భరంగా మారుతుందో తెలిసేలా తీసిన సినిమాతో చైతన్యం వస్తుందనే నమ్మకం ఉన్నదన్నారు.
ఒక మంచి సీఎం ఉంటే.. నల్ల చట్టాలు అమలు కాకుండా రాష్ర్టాలకు రావాల్సిన హక్కులను ఉపయోగించుకొని అన్నదాతకు ఎలా మేలు చేస్తారో కండ్లకుకట్టినట్టు చూపించేదే రైతన్న సినిమా అని ఆయన పేర్కొన్నారు. కేంద్రం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను విడనాడి, నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ, విద్యుత్తు చట్టాలు అమలైతే రైతు పండించిన పంటలను సొంతంగా అమ్ముకునే అవకాశం లేకుండా పోతుందని, తెలంగాణ అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, నిరంతర ఉచిత విద్యుత్తు దక్కదన్నారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు, విద్యుత్తు సంస్కరణలు అమలైతే కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సాగుకు ఉచిత విద్యుత్తు సరఫరా ఉండదని తేల్చిచెప్పారు. ప్రతి వ్యవసాయ బావికి కరెంటు మీటరు పెట్టి, బిల్లు కట్టకుంటే సరఫరా నిలిపివేసే మునుపటి రోజులు వస్తాయని, నీరందక పంటలు ఎండిపోయి నష్టాల పాలైన రైతుల ఆత్మహత్యలు పునరావృతం అవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.