‘గుజరాత్‌లో రూ.600 పింఛన్ ఇయ్యనోళ్లు హుజూరాబాద్‌లో మాత్రం రూ.3వేలు ఇస్తరట. అక్కడ ఇయ్యనోళ్లు ఇక్కడ ఇస్తరా? గీ బీజేపీ మ్యానిఫెస్టో చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో అర్థమైతలే’ అని ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. అన్ని సర్వేల్లో గెల్లు శ్రీనివాస్ గెలుస్తాడని తెల్వడంతో ఓడిపోతామనే భయంతో బీజేపీవాళ్లు సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంటలో నిర్వహించిన ధూంధాంకు టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ విజయ, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులుతో కలిసి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. దెబ్బలు కొట్టిండనో, షుగర్ వచ్చిందనో పడిపోతే రెండు ఓట్లు పడుతాయని చూస్తున్నారని అన్నారు.
వాళ్లపై వాళ్లే రాళ్లు వేసుకుని అయ్యో పాపమని యాక్టింగ్ చేస్తారని హెచ్చరించారు. గతంలో కరీంనగర్ ఓట్లప్పుడు బండి సంజయ్ అట్లనే పడిపోయి దవాఖానలో చేరి, ఓట్లు కాగానే మంచిగా లేచాడని గుర్తుచేశారు. ఇ లాంటి నాటకాలు నమ్మొద్దని, మొసలి కన్నీళ్లకు మోసపోవద్దని కోరారు. ‘30న ఓటు వేయడానికి వెళ్లేముందు సిలిండర్‌కు దండం పెట్టి.. కారు గుర్తుకు ఓటేసి బీజేపీని బొంద పెట్టాలి’ అని పిలుపునిచ్చారు.