పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డివిరుస్తున్న బీజేపీకి ఓటు వేయడమంటే మన వేలితో మన కన్నునే పొడుచుకోవడం అని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో సోమవారం ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. వీణవంకలో సమావేశంపెట్టిన బీజేపీ నాయకులు అన్ని మొండి మాటలు.. తొండి మాటలు చెప్పారని ధ్వజమెత్తారు. కేంద్ర సర్కారు ఒకే నెలలో 18సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదల బతుకులు ఆగంజేసిందని మండిపడ్డారు. డీజిల్ ధరలు పెరగడంవల్ల యాసంగిలో రైతులకు పెట్టుబడికే రూ. 6వేలు దాకా అయ్యిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మనల్ని నిలువునా దోచుకుంటున్న బీజేపీకి ఇంకా ఓటేద్దామా? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.
క్రూడాయిల్ ధరలు పెరగడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారని, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కిషన్‌రెడ్డి ఇలాంటి అబద్ధాలు ఆడవచ్చా అని మండిపడ్డారు. ఈ విషయంపై మాట్లాడేందుకు జమ్మికుంట గాంధీచౌరస్తా, చల్లూరు చౌరస్తాకు వస్తావా? అని కిషన్‌రెడ్డికి సవాల్ విసిరారు. పెట్రోల్, డీజిల్ ధర రూ. 100 లో రూ. 32 కేంద్రానికి పోతున్నాయని, ఏడేళ్లలో కేంద్ర పన్నులు రూ. 4 నుంచి రూ. 32కు పెంచిన ఘనత బీజేపీకే దక్కుతుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. 95శాతం మందికి పెట్రోల్, డీజిల్ అవసరమే లేదని ఓ కేంద్రమంత్రి అంటున్నారని, పెట్రోల్, డీజిల్ అవసరంలేని మనిషి ఉన్నాడా? అని ప్రశ్నించారు. కేంద్రమంత్రులతోసహా బీజేపీ నాయకులందరూ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈటల రాజేందర్ చేరిన బీజేపీనే గ్యాస్ సిలిండర్ ధరను రూ. 500 నుంచి రూ. వెయ్యికి చేసిందని, సబ్సిడీ పూర్తిగా ఎత్తేసిందని వ్యాఖ్యానించారు. గ్యాస్ సిలిండర్‌పై రాష్ట్ర సర్కారు రూ. 291 పన్ను విధిస్తున్నదని ఈటల రాజేందర్ ఆరోపించారని, అది నిజమని నిరూపిస్తే ఆర్థికమంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరితే.. ఈటల పత్తాలేడని హరీశ్‌రావు అన్నారు. నవంబర్‌లో గ్యాస్ సిలిండర్ ధర మరో రూ.200 పెరగనుందని చెప్పారు. బీజేపీకి నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే గ్యాస్ సిలిండర్‌పై రూ. 500 సబ్సిడీ ఇవ్వాలని, ధర తగ్గించాలని హరీశ్‌రావు డిమాండ్‌చేశారు. కేసీఆర్ కిట్ కింద ఇచ్చే మొత్తంలో కేంద్రం రూ.5వేలు ఇస్తున్నదంటూ బీజేపీ నాయకులు అబద్ధాలు ఆడుతున్నారని, మరి బీజేపీ పాలితప్రాంతాల్లో ఈ పథకం ఎందుకు పెట్టలేదో చెప్పాలని ప్రశ్నించారు.
రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిన బీజేపీకి ఇంకా ఓటేస్తామా? అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పూటకో మాట మాట్లాడుతున్న హరీశ్‌రావును ఎలా విశ్వసించాలి? అని ప్రశ్నించారు. అన్నదాతలు ఆగంకావొద్దని తెలంగాణ సర్కారు ధాన్యం కొంటున్నదని, అదే బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం వడ్లు కొనట్లేదని రైతులు రోడ్లపైనే ధాన్యాన్ని తగలపెడుతున్నారని హరీశ్‌రావు చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోకూడా వడ్లు కొనడంలేదని తెలిపారు. అలాంటి పార్టీకి ఓటేస్తే అన్నదాతలు, ప్రజలకు ఏం ప్రయోజనం కలుగుతుందో ఆలోచించుకోవాలన్నారు. ఈటల రాజేందర్ మంత్రిగా ఉండి హైదరాబాద్‌లో పెద్ద మెడికల్ కాలేజీ కట్టుకున్నాడని, కానీ పేద విద్యార్థులకోసం ఇక్కడ ఒక డిగ్రీ కాలేజీ తేలేకపోయాడన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ కనీసం..ఇక్కడ ఒక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ అన్నా నెలకొల్పేలా కృషిచేశారా? అని ప్రశ్నించారు.
యువకుల కష్టాలు.. యువకుడైన గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కే తెలుస్తాయని హరీశ్‌రావు అన్నారు. పేదవాళ్లకు, ఉద్యమకారులకు రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. యాదవ కుటుంబంలో పుట్టిన నిరుపేద బిడ్డకు సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారని, తోటి విద్యార్థులు గెల్లు శ్రీనుకు అండగా ఉండాలని కోరారు. ఈటల రాజేందర్ గెలిస్తే అక్కడ చేతులు కట్టుకుని నిలబడాలని, అదే గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలిస్తే దోస్తులాగా ఎప్పుడంటే అప్పుడు సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. ఈటల రాజేందర్‌ను ఎన్నిసార్లు అడిగినా.. దీక్షలు చేసి ధర్నాలు చేసినా చల్లూరును మండలం చేయలేదని తన దృష్టికి వచ్చిందన్నారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపిస్తే చల్లూరు సీతారామస్వామి సాక్షిగా చల్లూరును మూడు నెలల్లో మండలంగా చేస్తానని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, వివేకానంద్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, పాడి కౌశిక్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.