ముఖ్యమంత్రి కేసీఆర్‌ది చలించిపోయే హృదయం అని మాజీ మంత్రి, టీఆర్ఎస్ నాయకులు కడియం శ్రీహరి అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా సంక్షేమ తెలంగాణ సాకారం అనే తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ కడియం శ్రీహరి మాట్లాడారు. ఉద్యమ సమయంలో లక్షలాది మంది ప్రజలను కేసీఆర్ కలుసుకున్నారు. వారి బాధలు, కష్టాలు, ఆకలిచావులు, ఆత్మహత్యలను స్వయంగా చూసి చలించిపోయారు. ఉద్యమంలో ఆయన చూసిన సన్నివేశాల నుంచి పుట్టినవే ఈ సంక్షేమ పథకాలు. దేశమే అబ్బురపడే విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి.
వృద్ధ తల్లిదండ్రులకు పెద్దకొడుకు. ఆడబిడ్డలకు మేనమామ. ఒంటరి మహిళలకు తోబుట్టువు.. దళితులకు ఒక బంధువు అని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల జీవితాలకు భరోసా కల్పిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక వనరులను దృష్టి పెట్టుకుని ఆసరా పెన్షన్లను క్రమక్రమంగా పెంచుతున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల వల్ల నిరుపేద ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు. ఈ రెండు పథకాలు ఓట్ల కోసం, రాజకీయాల కోసం ప్రవేశపెట్టలేదు. పేద ప్రజలకు కడుపునిండా భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో.. ప్రతి కుటుంబానికి రేషన్ బియ్యం అందిస్తున్నామని తెలిపారు.
ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తున్నామని పేర్కొన్నారు. మన సంక్షేమ పథకాల్లో ప్రతిదానికి ఒక కథ, ప్రాధాన్యత ఉంది. సీఎం కేసీఆర్ గొప్ప మానవతావాది అని చెప్పారు. ప్రభుత్వ హాస్టళ్లల్లో చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. గురుకులాల్లో నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉన్నత విద్య కోసం అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ప్రవేశపెట్టారు. అన్ని కులాలను సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారు. ఆర్థిక పరిపుష్టి కోసం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సీఎం కేసీఆర్ బలోపేతం చేస్తున్నారు. బ్రహ్మణ, అర్చకుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు అని కడియం శ్రీహరి తెలిపారు.