తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై న ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్న హుజూరాబాద్‌లో ఏంచేసినా తమ పాచిక పారట్లేదన్న నైరాశ్యంతో బీజేపీ నాయకులు ఇల్లందకుంట మండ లం సిరిసేడులో కొత్త లొల్లికి తెరదీశారు. గ్రామంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరఫున కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు.
ప్రచారం స్థానిక టీఆర్‌ఎస్ కార్యాలయం వద్దకు చేరుకోగానే బీజేపీ శ్రేణులు సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అక్కడే ఉన్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఈటలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వెంటనే బీజేపే నాయకులు టీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడికి యత్నించారు. పోలీసులు వారించినా వినకుండా బీజేపీ శ్రేణులు గొడవకు దిగారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు సహనంతో ఉండి బీజేపీ కుట్రకు చెక్‌పెట్టారు. బీజేపీ శ్రేణుల దాడి యత్నాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో అబద్ధాలను ప్రచారంచేశారు. కేంద్ర మంత్రిపై టీఆర్‌ఎస్ నేతలు దాడికి ప్రయత్నించారని ఆరోపించారు.