ఈటలకు వ్యక్తిగా ఓటు వేయడం వల్ల అదనంగా హుజూరాబాద్‌కు లేదా బీజేపీ జాతీయ పార్టీ కనుక తెలంగాణకు జరిగే ప్రయోజనం ఏమిటీ? ఈటల, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని వేర్వేరుగా చూడాలా? రాజేందర్‌కు వేసినా, బీజేపీకి వేసినా.. ప్రజలకు కీడు చేస్తున్నవారిని ఏరికోరి మరీ నెత్తిన పెట్టుకున్నట్లు కాదా..!
కొందరు వీరావేశంతో బీజేపీని, మోదీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దేశంలో ఏవో అద్భుతాలు చేశారని, భవిష్యత్తులో చేయబోతున్నారని అంటున్నారు. వాస్తవానికి మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికైతే దేశ ప్రజలను కుంగదీసినవే. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధి రేటు ముందెన్నడూ లేనిరీతిలో పడిపోయింది. అది కో లుకోవడానికి ఎంత సమయం పడుతుందో, ఇంకా ఎన్ని కోట్ల మంది ఉపాధి కోల్పోవాలో తెలియదు.
విద్య, ఉద్యోగ, ఉపాధిరంగాల్లో తాము వైఫల్యం చెందామనే విషయాన్ని కమలనాథులు పదేపదే రుజువు చేసుకుంటున్నారు. జాతీయస్థాయిలో బలహీనమైన ప్రతిపక్షం ఉన్న కారణంగా మోదీ, ఆయన అనుచరులు ఆడిందే ఆట, పాడిందే పాటలా సాగుతున్నది. ‘ఎక్కువ మందిని కొంత కాలం మోసం చేయగలరు. కానీ ఎల్లకాలం అందర్నీ మోసం చేయలేరు. కానీ బీజేపీ నేతలు దాన్ని కూడా సుసాధ్యం చేస్తామనుకుంటున్నారు. అందుకే హుజూరాబాద్‌లో మోదీ అది చేశారని, ఇది చేశారని ఊదరగొడుతున్నారు.
దేశానికి వెన్నెముక రైతు. ఆ రైతు గురించి మోదీకి పట్టింపే లేదు . కొన్ని నెలల నుంచి రైతులు దేశ రాజధానికి సరిహద్దులో ఆందోళన చేస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు తమ ఉనికి లేకుండా చేస్తాయని రైతులు కంటికి మింటికి రోదిస్తున్నా మోదీ పట్టించుకోవడం లేదు. అంతేకాదు రైతుల పైనుంచి కారు నడిపి రైతుల ప్రాణాలు తీస్తున్నారు.
కరోనా లాక్‌డౌన్ కాలంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రభావం గురించి ప్రఖ్యాత జర్నల్ ‘లాన్సెట్’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. లాక్‌డౌన్ కారణంగా 30 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని చెప్పింది. రాబోయే రెండేండ్లలో 20 కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన తక్షణావసరం ఉందని తన నివేదికలో పేర్కొన్నది. ఉపాధి పోయిన వారిని ఆదుకోవడానికి 20 లక్షల కోట్ల ప్యాకేజీలు ఇచ్చామని చెప్పుకొంటున్నారు, కానీ వాస్తవంలో ఎవరికీ ఏ సాయం అందిన దాఖలాలు లేవు.
పెద్దనోట్ల రద్దు వల్ల చిన్న, మధ్యతరహా, కుటీర పరిశ్రమలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోట్ల మంది జీవితాలు తలకిందులయ్యాయి. ఇవేవీ మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మోదీ మొసలి కన్నీరు కార్చి దేశ ప్రజలను మభ్య పెట్టాలని చూశారు. ఏడేండ్ల కాలంలో మోదీ ప్రభుత్వం నిరుద్యోగులకు చేసిందేమీ లేదు. అన్నింటికంటే రైతుల విషయంలో, గిట్టుబాటు ధరల విషయంలో కార్పొరేట్ కంపెనీలపై ఉన్న ప్రేమ రైతులపై లేదని రుజు వు చేసుకుంటున్నారు. దానికితోడు ఇటీవల ‘పైపులైన్ మానిటైజేషన్’ పాలసీ తీసుకొచ్చారు. లక్షల కోట్లు విలువ చేసే ప్రభుత్వరంగ సంస్థలు అప్పనంగా ప్రైవేటువారికి కట్టబెడ్తున్నారు. కాస్త దృష్టిపెడితే ప్రభుత్వరంగ సంస్థలే అతిపెద్ద ఉపాధి కేంద్రాలవుతాయి. కానీ అలాంటి ఆలోచన చేయడం లేదు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు. దీని ప్రభావం ఎంతో కొంత ఇతర అంశాలపైనా ఉంటుంది. దేశాన్ని అడ్డీకి పావుషేరు కింద అమ్ముతున్న మోదీ విధానాలకు చెక్ పెడుతున్నామంటూ హుజూరాబాద్ నుంచే తీర్పు వెలువడాలి. దేశస్థాయిలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న పార్టీ తరఫున బరిలో నిలబడిన వ్యక్తికి ఓటు వేయడమంటే మరోసారి తమను మోసం చేసేవారిని తెచ్చి నెత్తిన పెట్టుకోవడమవుతుంది.
కేంద్రంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తెలంగాణ కు చేసిందేమిటీ? ఇక్కడున్న బీజేపీ ఎంపీలు చాలా విషయాలు మాట్లాడుతున్నారు. వారు మోదీతో మాట్లా డి తెలంగాణకు ఏ పాటి నిధులు తెచ్చారు? వారు చెప్తున్న మాటలకు, చేస్తున్న చేతలకు పొంతన లేదు. అందుకే హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఓటు వేసే ముందు వ్యక్తి దృష్టితో కాకుండా అందరికీ నష్టం కలిగించే పార్టీని తిరస్కరించాలి. ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీని గెలిపించుకోవాలి.
సెంటిమెంట్ పేరుతో ఈటల ఎన్ని మాటలు చెప్పినా కపటమే. అన్యాయం జరిగిందని ఓట్ల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారు. పెంచి పెద్ద చేసి.. ఓ స్థాయి కల్పించిన పార్టీని, నాయకునికి వెన్నుపోటు పొడిచారు. దేశంలోనే గణనీయమైన అభివృద్ధిని చేతల్లో చూపిస్తున్న కేసీఆర్‌ను నిత్యం తులనాడే ఈటలకు ఓటేయడమంటే మన చేయితో మన కన్నును పొడుచుకోవడమే. ఏడేండ్ల తెలంగాణలో తమ జీవితాల్లో వచ్చిన, వస్తున్న మార్పులను హుజూరాబాద్ నియోజకవర్గ ఓటర్లు గమనించాలి. బలమైన నాయకుడు- స్థిరమైన ప్రభుత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష.
(వ్యాసకర్త: శ్రీ చంటి క్రాంతికిరణ్, అందోల్ ఎమ్మెల్యే)