యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. సీఎం కేసీఆర్ పునః ప్రారంభ ముహూర్త పత్రికను దేవస్థానం ఈవోకు అందజేశారు. ముహూర్త పత్రికను స్వామి పాదాల చెంత ఉంచాలని సూచించారు. త్రిదండి రామానూజ చినజీయర్ స్వామి స్వదస్తూరితో ముహూర్త పత్రిక రాసి ఇచ్చారు. ఈ సందర్భంగా 10వేల మంది రుత్వికులతో సుదర్శన హోమం నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. హోమాన్ని చినజీయర్ స్వామి పర్యవేక్షిస్తారని చెప్పారు. మరికొద్ది సేపట్లో సీఎం కేసీఆర్ ముహూర్త వివరాలను ప్రకటించనున్నారు.
ఇవాళ ఉదయం నుంచి సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం.. ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. గండి చెరువు, పుష్కరణి, కల్యాణకట్ట, దీక్షాపరుల మంటపం, సత్యనారాయణ వ్రతమంటపం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్లు, గర్భాల ద్వారాలు, బంగారు తాపడాలు, ఆళ్వార్ మంటపం పనులను పరిశీలించారు.
అలాగే క్యూకాంప్లెక్స్, ఎస్కలేటర్స్, శివాలయం, విష్ణు పుష్కరిణితో పాటు క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణం, ధ్వజస్తంభం ఏర్పాటు చేసిన వేదికను సైతం పరిశీలించగా.. పనుల పురోగతిని సీఎంకు ఆలయ స్తపతి ఆనంద్‌సాయి వివరించారు. ఈ సందర్భంగా తుది పనులపై సీఎం పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని సీఎం కేసీఆర్ మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆదేశించారు. రింగు రోడ్డు కోసం షాపింగ్ స్థలాలు కోల్పోయిన వారికి కల్యాణ కట్ట సమీపంలో వేయి స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఉచితంగా షాపులు నిర్మించి ఇవ్వాలని సూచించారు.