బుద్ధిగా ప్రేమించే వారికి గోపికమ్మ! ఘాటుగా ఆరాధించే వారికి జిగేలు రాణి!! నడక.. సామజవరగమన.. నవ్వు.. రస్మైక రాగ హిందోళం.. అందం.. తన సొంతూరు అనిపించే తీరు.. ఇదీ క్లుప్తంగా పూజా హెగ్డే పరిచయం! వరుస హిట్లతో టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్ అనిపించుకున్న ‘పూజా హెగ్డే’ను ‘జిందగీ’ పలకరించింది.
సక్సెస్‌ఫుల్ మూవీస్‌తో మోస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్ అయ్యారు.. దీన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు?
మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. మొదట్నించీ నన్ను, నా సినిమాలను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్. నన్ను ఇంతలా అభిమానిస్తున్నారు కాబట్టే, వరుస సినిమాలు చేయగలుగుతున్నా. రెండు లాక్‌డౌన్‌ల గ్యాప్ తర్వాత విడుదలైన మా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాను థియేటర్లలో చూస్తూ.. మా టీమ్‌కు సపోర్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో నా పాత్రకు మంచి రివ్యూలు వస్తున్నాయి.
సినిమా ఎంపికలో ఏ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు?
ఒక్కో సినిమా ఎంపికలో ఒక్కో అంశం ప్రాధాన్యంగా అనిపిస్తుంది. కొన్ని సినిమాలను కథ నచ్చి ఒప్పుకొంటే, కొన్నిటిని డైరెక్టర్‌పై నమ్మకంతో సైన్ చేస్తాను. అలాగే, కథ చెప్పినప్పుడు నా క్యారెక్టర్ నచ్చితే కూడా సినిమాను ఒప్పుకొంటాను. నా కెరీర్‌లో స్టార్ హీరోలతో పాటు కొత్త కథానాయకులతోనూ చేశాను. కాబట్టి ఒక్క పాయింట్‌కే నేను పరిమితం కాలేను. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కూడా నా క్యారెక్టర్ వైవిధ్యంగా ఉండటంతో ఒప్పుకొన్నా. ఇందులో రకరకాల షేడ్స్ ఉంటాయి. స్టాండప్ కమెడి
యన్‌గా చేయడం కోసం బాగా హోమ్‌వర్క్ చేశాను. రకరకాల కామెడీ సినిమాలు, కామెడీ షోలు చూసి ప్రిపేర్ అయ్యాను.
ఒకేసారి నాలుగైదు సినిమాల షూటింగ్స్ చేస్తుంటారు. టైమ్ ఎలా మేనేజ్ చేయగలుగుతారు?
నన్ను అందరూ వర్క్‌హాలిక్ అంటారు. బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పుడు టైమ్ మేనేజ్‌మెంట్ అంత సులువైన పని కాదు. కానీ, నాకు ఎప్పుడూ పని చేయడమే ఇష్టం. ఈ విషయంలో మాత్రం నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బాగుంది. షూటింగ్స్ కోసం ప్రపంచమంతా తిరుగుతూ బిజీ బిజీగా ఉంటాను. ఇంటికి వెళ్లడం అరుదు. అయినా సరే, నా ఇష్టానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్లడం కుదరనప్పుడూ అర్థం చేసుకుంటారు. నన్ను చూడాలనిపించినప్పుడు వాళ్లే షూటింగ్ స్పాట్స్‌కు వస్తారు. మా అమ్మానాన్నలే నాకు పెద్ద క్రిటిక్స్. ప్రస్తుతం ఆరు సినిమాలతో బిజీగా ఉన్నాను. కొన్ని షూటింగ్ స్టేజ్‌లో ఉంటే, మరికొన్ని విడుదలకు సిద్ధమవుతున్నాయి.
లాక్‌డౌన్ సమయంలో ఏం చేశారు?
లాక్‌డౌన్‌కు ముందు మూడేండ్లు వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాను. ఒక్కసారిగా చాలా సమయం దొరికినట్టు అనిపించింది. కానీ, ప్రపంచమంతా కరోనా వల్ల ఇంత ఇబ్బందిపడటం చూసి చాలా బాధగా అనిపించింది. ఆరోగ్యానికి మించిన విలువైన ఆస్తి ఏదీ లేదని తెలుసుకున్నాను. నిరుపేద కుటుంబాలు ఆకలితో అలమటించడం చూసి చలించిపోయాను. అందుకే నా వంతు సాయం చేసుకుంటూ వచ్చాను. లాక్‌డౌన్‌లో చాలా సమయం అందుకే కేటాయించాను. అలాగే వంట నేర్చుకున్నాను. పుస్తకాలు చదివాను. టీవీలో సినిమాలు, ప్రోగ్రామ్స్ చూశాను.
సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నట్టున్నారు..
కొంతకాలంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. నా సంపాదనలో అవసరం ఉన్నవాళ్లకు ఎంతో కొంత సాయం చేయాలని ఎప్పట్నుంచో ఉండేది. ఆ ఉద్దేశంతోనే లాక్‌డౌన్‌లో పేదలకు ఉచితంగా రేషన్ అందివ్వడం, మెడికల్ బిల్స్ కట్టడం లాంటివి చేశాను. నలుగురికీ సాయం చేసే దిశగా పదిమందినీ కదిలించడానికి ‘ఆల్ అబౌట్ లవ్’ సంస్థను స్థాపించాను. ఒకర్ని చూసి ఇంకొకరు స్ఫూర్తిపొంది ముందుకు వస్తారనే ఆశతో దీన్ని ప్రారంభించాను. అందరూ లక్షలు, వేలు ఇవ్వాలని లేదు, తమకు చేతనైనంతలో ఇతరులకు సాయం చేస్తే చాలు. ఆఖరికి, వంద రూపాయలు కూడా అవతలివాళ్లకు ఏదోవిధంగా అవసరం అవుతాయి. మా సంస్థకు సంబంధించి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాను.
నాకు చీరలంటే ప్రత్యేకమైన గౌరవం. నా దృష్టిలో ఎవరికైనా సరే, చీరలు చక్కగా నప్పుతాయి. అలాగే ఇటీవల నా పుట్టినరోజు సందర్భంగా ‘ఆచార్య’ టీమ్ లంగావోణీలో ఉన్న నా పోస్టర్‌ను విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘గద్దలకొండ గణేష్’లో శ్రీదేవి క్యారెక్టర్‌కి లంగావోణీలే వేసుకున్నాను. ఇప్పుడు ‘ఆచార్య’లో నీలాంబరిగా అలానే కనిపిస్తాను. పర్సనల్‌గా ఇంట్లో లంగావోణీలు వేసుకోవడం అలవాటే.
నాకు నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా మా అమ్మ చేసే ‘మంగళూరియన్ రొట్టి’ నా ఫేవరెట్. లాక్‌డౌన్‌లో వంటకాలపై ఎన్నో ప్రయోగాలు చేశాను. అయితే, అమ్మ చేసేవి కాకుండా వెరైటీగా ట్రై చేశాను. ఇంట్లో నన్ను ఇప్పుడు మాస్టర్ షెఫ్ అని పిలుస్తున్నారు.
చిన్నప్పట్నించి మాధురీ దీక్షిత్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా డ్యాన్స్‌కి పెద్ద ఫ్యాన్‌ని. ఆమెలా ఆల్‌రౌండ్ పెర్ఫార్మర్ అనిపించుకోవాలని ఉంది. హీరోల్లో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ సినిమాలు చూస్తూ పెరిగాను. ‘ఆచార్య’లో చిరంజీవి గారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది.
ఒకే హీరోతో రెండో సినిమా చేసినప్పుడు ఎక్కువ కంఫర్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే ముందు సినిమా చేస్తున్నప్పుడు పని వాతావరణం తెలుస్తుంది. అల్లు అర్జున్‌తో ‘డీజే’, ‘అల వైకుంఠపురములో’, వరుణ్‌తేజ్‌తో ‘ముకుంద’, ‘గద్దలకొండ గణేష్’, మహేశ్‌బాబుతో ‘మహర్షి’, ఇప్పుడు మరో సినిమా చేస్తున్నా. ఇలా రెండో ఆఫర్ వస్తున్నదంటే దానికి కారణం, ప్రేక్షకులు మా జోడీని ఆదరించడమే.